ఎండాకాలం జాగ్రత్తలు.. వడదెబ్బ తగిలితే ఇలా మాత్రం చేయకండి

ఎండాకాలం జాగ్రత్తలు.. వడదెబ్బ తగిలితే ఇలా మాత్రం చేయకండి

ఒంట్లో నీళ్లతో పాటు ఓపికనూ పీల్చేసే సీజన్ ఇది. ఠారెత్తించే ఎండ. తట్టుకోలేని వేడి. భరించలేనంత ఉక్కబోత. చెప్పలేనంత నీరసం. వీటన్నింటి నుంచి గట్టెక్కాలంటే సరైన కేర్ తీసుకోవాల్సిందే. ఎండ నుంచి చర్మాన్ని, జుట్టుని కాపాడుకోవాల్సిందే. ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడాలంటున్నారు డాక్టర్లు. వేసవిలో వచ్చే సమస్యల్లో వడదెబ్బ ఒకటి. శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి అమాంతంగా బాడీ టెంపరేచర్ పెరిగిపోతే వచ్చే సమస్యే వడదెబ్బ. అందుకే ఈ సీజన్‌‌‌‌లో వేడిని నెగ్లెక్ట్ చేయకూడదు.


ఆ టైంలోనే ఎక్కువ కేర్
ఈ సీజన్‌‌‌‌లో బయట టెంపరేచర్‌‌‌‌‌‌‌‌తో పాటు బాడీ టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ కూడా బాగా పెరిగిపోతుంది. అలాంటప్పుడే ఎండదెబ్బ తగులుతుంది. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకూ పెరిగిపోతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య టైంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.  అందుకే ఆ టైంలో బయటకు వెళ్లకూడదు. దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు  చలువ చేసే ఫుడ్ ఎక్కువగా తినాలి. నిల్వ పచ్చళ్లు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరేచనాలు, సెగ గడ్డలు వస్తాయి.  అలాంటప్పుడు బాడీలో వేడిని తగ్గించే ఫుడ్ తినాలి.


నీళ్లే బెస్ట్ మెడిసన్   
వేసవి తాపాన్ని తీర్చేవి కచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించింది మరొకటి లేదు. గంటగంటకూ నీళ్లు తాగాలి. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు.  తియ్యదనం కోసం  కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫీషియల్ జ్యూస్‌‌‌‌లూ తాగకూడదు. టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగడం వల్ల దాహం తీరదు. పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్, చక్కెర ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే, వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్సే ఎక్కువగా తాగాలి.  లేదంటే డీ హైడ్రేషన్‌‌‌‌ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మ రసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుంది.

 
వీళ్లకు రిస్క్ ఎక్కువ
మందుల ప్రభావం వల్ల బీపీ, షుగర్ పేషెంట్స్‌‌‌‌లో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నా అలాంటి వాళ్లు తేలికగా ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.  అందుకే ఈ కాలంలో వాళ్లు  ఎక్కువ కేర్ తీసుకోవాలి. లో–బీపీ ఉన్న వాళ్లు ఉప్పు మోతాదు పెంచుకోవచ్చు. నీళ్లలో, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగొచ్చు. హైబీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం డాక్టర్‌‌‌‌‌‌‌‌ సలహాతో మందులు మార్పించుకోవాలి. డయాబెటిస్ ఉన్న వాళ్లకు నీరసం త్వరగా వస్తుంది. కాబట్టి ప్రతి మూడు గంటలకోసారి ఫుడ్ తినాలి. పళ్లు, సలాడ్లు తింటూ ఉండాలి.


స్కిన్ కేర్
ఎండ తీవ్రత మొదట చర్మంపైనే పడుతుంది. ముఖం, మెడ, చేతులు, కాళ్లు..ఇలా ఎండకు ఎక్స్‌‌‌‌పోజ్‌‌‌‌ అయ్యే భాగాలన్నీ ట్యాన్‌‌‌‌కు గురవుతాయి. అలా కాకూడదంటే ఎండలోకి వెళ్లినా వెళ్లకపోయినా సన్‌‌‌‌స్ర్కీన్‌‌‌‌ లోషన్‌‌‌‌ రాసుకోవాలి. ఎండలోకి వెళ్లే పావు గంట ముందే లోషన్‌‌‌‌ రాయాలి. ఎండలో ఉన్నంతసేపు చర్మం మీద ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


కళ్ల మంటలు
ఈ సీజన్‌‌‌‌లో 30 శాతం కళ్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఎండల్లో ఎక్కువసేపు ఉంటే కళ్లు ఎరుపు రంగులోకి మారుతాయి. ఒక్కోసారి కనురెప్పలపై వాపు వస్తుంది. ఇవన్నీ ఎండలు, తీవ్రమైన వేడి వల్లే వస్తాయి. అయితే వీటి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఎక్కువ టైం ఎండలో పనిచేయడం, బైక్స్ పై ప్రయాణించడం వంటివి తగ్గించాలి. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే ఉండటం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినా కూల్ గ్లాసెస్, క్యాప్స్, స్కార్ఫ్స్ వంటివి వాడాలి. ఎండలోంచి ఇంటికి వచ్చాక చల్లని నీళ్లలో ముంచిన దూది లేదా కీరా ముక్కలను కళ్లపై పెట్టాలి. ఇలా చేస్తే కళ్లు అలసిపోకుండా ఉంటాయి. పైగా కళ్లలో ఉండే ఎరుపు రంగు తగ్గుతుంది.


పిల్లలు, పెద్దవాళ్లు జాగ్రత్త
పిల్లలు, వృద్ధులు... దాహం వేస్తుందనే విషయాన్ని బయటకు చెప్పలేరు. వాళ్లకు వాళ్లే నీళ్లు తాగలేరు. పైగా వాళ్లలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. ఏ ఫుడ్ తిన్నా తేలికగా జీర్ణం కాదు. అలాంటివాళ్లు తొందరగా ఎండదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పగటి వేళ వాళ్లను బయటకు పంపకూడదు. తేలికగా జీర్ణమయ్యే వాటిని పెడుతూ నీడ పట్టునే ఉంచాలి. సాయంత్రం ఐదు గంటల తర్వాత పిల్లలను ఆటలకు బయటకు పంపొచ్చు. ఎండదెబ్బ తగలకుండా ఉండాలంటే ఇంట్లో చల్లదనం ఉండాలి. వాళ్లు అడిగినా, అడగకపోయినా తరచుగా నీళ్లు తాగించాలి. నీళ్లు తాగడానికి ఇష్టపడకపోతే పళ్ల రసాలు, గ్లూకోజు నీళ్లు, మజ్జిగ ఇవ్వొచ్చు.


జుట్టు సమస్యలు
చర్మం తరువాత ఎండ ప్రభావం ఎక్కువగా పడేది వెంట్రుకల పైనే. ఎండలో తిరగడం వల్ల వెంట్రుకలు నిర్జీవంగా మారతాయి. చివర్లు చిట్లి పోతాయి. అలాగే వేసవిలో రోజూ తలస్నానం చేస్తే మంచిదని అనుకుంటారు. కానీ, ఇది కరెక్ట్ కాదు. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. అది కూడా హెర్బల్ షాంపూలతో. మాడును క్లీన్ చేస్తూ తలస్నానం చేయాలి. కండిషనర్లు వాడకుండా ఉంటేనే మంచిది. ఎండలో తిరిగి వచ్చాక హెయిర్ కలర్ వేసుకోకూడదు. ఇంట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. 

వడదెబ్బ తగిలితే నీళ్లు పట్టకూడదు
ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. మళ్లీ పైకి లేవాలంటే నీరసం. ఒళ్లు నొప్పులు. శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. గొంతు ఎండిపోయినట్టు ఉంటుంది. ఇవన్నీ సన్ స్ట్రోక్ లక్షణాలు. వీటితో పాటు ఒక్కోసారి వాంతులు, విరేచనాలు, చెమట పట్టకపోవడం, చర్మం పొడిబారడం, ముడతలు పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ ఎండలో వడదెబ్బ తగిలి పడిపోతే వాళ్లను ఎండలోంచి నీడలోకి తీసుకొని రావాలి. కాసేపు విశ్రాంతి ఇవ్వాలి. బట్టలు బిగుతుగా ఉంటే వదులు చేయాలి. మెడ, అరికాళ్లు, అరిచేతులు, నుదుటి పైన చల్లని నీళ్లలో ముంచిన బట్టతో తుడవాలి. స్పృహలో ఉంటే మంచినీళ్లు తాగించాలి.  స్పృహలో లేనివాళ్లకు నీళ్లు పడితే అవి గొంతులోకి కాకుండా కిడ్నీలు, ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఆ టైంలో నీళ్లు పట్టకూడదు. ఒకవేళ సన్ స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్‌‌‌‌ని‌‌‌‌ కలిసి ట్రీట్‌‌‌‌మెంట్ తీసుకోవాలి. -డా.ఎమ్.గోవర్ధన్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

బెస్ట్ ఫుడ్​
జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ సీజన్‌‌‌‌లో  మంచి ఫుడ్ తినాలి. ఫ్రైలు, ఆయిలీ ఫుడ్‌‌‌‌కి దూరంగా ఉంటూ నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలి. మజ్జిగ మంచినీళ్లతో పాటు వేసవికాలంలో ఎక్కువగా తీసుకోవాల్సిన వాటిలో ఒకటి మజ్జిగ. రోజులో ఎక్కువ సార్లు మజ్జిగ తాగాలి. ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

పుచ్చకాయ
పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అందుకే ఈ సీజన్‌‌‌‌లో ఎక్కువగా తినాలి. ముఖ్యంగా  పిల్లలు, పెద్దవాళ్లకు కచ్చితంగా పుచ్చకాయ ఇవ్వాలి. దీనివల్ల శరీరం డీ హైడ్రేట్ కాదు.

కర్బూజ
ఇందులో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టదు. శరీరంలో నీళ్ల స్థాయిని పెంచుతుంది.

జామ
జామ కాయలో విటమిన్– సి ఎక్కువ. యాంటీ ఇన్‌‌‌‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌‌‌‌లో ఎక్కువగా జామ కాయ తింటే హెల్దీగా, ఎనర్జిటిక్‌‌‌‌గా ఉంటారు. అందులో ఉండే ప్రొటీన్లు ఎప్పటికప్పుడు శక్తిని అందిస్తాయి.

కొబ్బరి బోండాం
ఒక కొబ్బరి బోండాం ఐదు సెలైన్ బాటిళ్ల శక్తిని ఇస్తుంది అంటారు.  కాబట్టి ఈ సీజన్‌‌‌‌లో కొబ్బరి బోండాన్ని ఎక్కువగా తాగాలి. శరీరంలోని టాక్సిన్‌‌‌‌ను ఇది నివారిస్తుంది. పైగా చర్మం మృదువుగా, హెల్దీగా కనిపించాలంటే రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా కొబ్బరి బోండాం తాగాల్సిందే.

కూరగాయలు
సొరకాయ, బీర, పొట్లకాయ, టొమాటో, క్యాబేజీ, దోసకాయ వంటి కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేసవికాలంలో వీటిని ఎక్కువగా తినాలి. నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవాళ్లు మిగతా కాలాల్లో కంటే ఈ కాలంలో తక్కువగా తినాలి. లంచ్, డిన్నర్ టైంలో నాన్ వెజ్ తింటే జీర్ణం అంత బాగా అవ్వదు. అందుకే ఆ టైంలో నాన్ వెజ్ తినకూడదు. వీలైతే రాత్రిళ్లు డిన్నర్‌‌‌‌‌‌‌‌కు బదులు సలాడ్లు, పళ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం లైట్‌‌‌‌గా ఉంటుంది. దీంతో రోజంతా యాక్టివ్‌‌‌‌గా ఉంటారు.