మునగాకుతో పప్పు, కారం పొడి ఇలా.. ఎన్నో వెరైటీలు తయారుచేసుకోవచ్చని తెలిసిందే. పైగా ఈ మునగాకులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఈ మధ్య చాలామంది ఏదో ఒక రూపంలో తమ డైట్లో మునగాకు ఉంచుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్లలో మీరూ చేరాలనుకుంటే సింపుల్గా.. టేస్టీగా.. హెల్దీగా.. ఉండే ఈ రెసిపీలు ఫాలో అయిపోండి.
టిక్కీ
కావాల్సినవి :
మునగాకు - ఒక కప్పు, బియ్యం, కందిపప్పు - ఒక్కోటి అర కప్పు
ఉప్పు, నూనె - సరిపడా, కారం - ఒక టీస్పూన్, పసుపు, ధనియాల పొడి, చక్కెర, నిమ్మరసం, సోంఫు - ఒక్కోటి అర టీస్పూన్
తయారీ:
బియ్యం, కందిపప్పును కడిగి వేర్వేరు గిన్నెల్లో ఒక గంటపాటు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి అందులో పసుపు, ఉప్పు, కారం, సోంఫు, ధనియాల పొడి, చక్కెర, నిమ్మరసం వేసి కలపాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసి కలపాలి. ఆ పిండిని కొంచెం కొంచెంగా అరచేతిలోకి తీసుకుంటూ చిన్న గారెల్లా వత్తాలి. అలా తయారుచేసుకుని వేడి నూనెలో వేగించాలి.
పకోడీ
కావాల్సినవి :
మునగాకు - రెండు కప్పులు, శనగపిండి - ఒక కప్పు, బియ్యప్పిండి - అర కప్పు, నూనె, ఉప్పు - సరిపడా, కారం, జీలకర్ర, వాము, ధనియాల పొడి, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - ఒక్కోటి అర టేబుల్ స్పూన్, గరం మసాలా - అర టేబుల్ స్పూన్, పసుపు - పావు టీస్పూన్, నీళ్లు - మూడు టేబుల్ స్పూన్లు
తయారీ:
శుభ్రంగా కడిగిపెట్టుకున్న మునగాకుని ఒక గిన్నెలో వేసి అందులో శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వాము, ధనియాల పొడి, అల్లం– వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. పాన్లో నూనె వేడి చేసి అందులో పిండిని పకోడీల్లా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగిస్తే కరకరలాడే పకోడీ రెడీ.
లడ్డు
కావాల్సినవి:
మునగాకు పొడి - రెండు కప్పులు, కొబ్బరి తురుము, మిక్స్డ్ నట్స్ - ఒక్కో కప్పు, కర్జూరలు - ఒకటిన్నర కప్పు, తేనె - నాలుగు టేబుల్ స్పూన్లు, సన్ఫ్లవర్ సీడ్స్ - అర కప్పు, యాలకులు - అర టీస్పూన్, నెయ్యి - సరిపడా
తయారీ :
పాన్ వేడి చేసి అందులో కొబ్బరి తురుము వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్లో మిక్స్డ్ నట్స్ అన్నీ వేసి వేగించి, మిక్సీ పట్టాలి. అలాగే శుభ్రంగా కడిగి, గింజలు తీసేసిన కర్జూరాల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పెద్ద గిన్నెలో మునగాకు పొడి, కొబ్బరి తురుము, తేనె, కర్జూర గుజ్జు, నట్స్ పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చేతులకు నెయ్యి రాసుకుని
కొంచెం కొంచెంగా మిశ్రమాన్ని తీసుకుని లడ్డూల్లా తయారుచేయాలి. వీటిని అరగంట పాటు ఫ్రిజ్లో పెట్టి, తర్వాత తింటే టేస్ట్ బాగుం టుంది.
