ఫాంహౌస్ కేసు : విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

ఫాంహౌస్ కేసు : విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

ఫాంహౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వర్చువల్ విధానంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసును తిరిగి విచారిస్తామని చెప్పింది. కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే, ప్రతివాదుల తరఫున సుప్రీం కోర్టు అడ్వొకేట్ ఉదయ్ హొల్లా, సంజయ్ వాదనలు వినిపించారు. 

సిట్ విచారణను తప్పుబట్టడం సరికాదు 

ఫాం హౌస్ కేసు విచారణ 173 (8) సెక్షన్ కింద నిష్పక్షపాతంగా జరగాలని ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ దుష్యంత్ దవే కోర్టుకు విన్నవించారు. కేసు వివరాలను సీఎం ప్రెస్ మీట్ లో బయటపెట్టడంపై వివరణ ఇచ్చారు. సీఎం ప్రెస్ మీట్ నవంబర్ 3న జరిగిందని, అయితే అక్టోబర్ 29నే మెజిస్ట్రేట్ కు సీడీలు సమర్పించిన విషయాన్ని దవే గుర్తు చేేశారు. సీఎం సీడీలు బయట పెట్టారన్న కారణంతో సిట్ విచారణ రద్దు చేయడం సరికాదని అన్నారు. ఎఫ్ఐఆర్, ఎమ్మెల్యేల ట్రాప్ అంశాలను వదిలేసి సీడీల విషయంలోనే  ఎందుకు రాద్దాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాబు భాయ్ కేసు  తీర్పును ఆయన ప్రస్తావించారు. బాబు భాయ్ కేసులో ఇలాంటి వివాదమే తలెత్తితే విచారణ సంస్థను మార్చారని సింగిల్ జడ్జి ఆర్డర్ కాపీలో పేర్కొన్నారని.. కానీ ఆ కేసును సీఐడీకే ఇచ్చారని.. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వలేదని చెప్పారు. 

ఆధారాలు సీఎం చేతికి ఎలా వెళ్తాయ్?

నిందితుల తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ సంజయ్ సిట్ లో ముగ్గురు ఐపీఎస్ లు ఉన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీఎం చేతిలోనే వీరి ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు ఉంటాయన్న విషయాన్ని ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ డిసెంబర్ 3న నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆధారాలు బయటపెట్టారని స్పష్టం చేశారు. సిట్ వద్ద ఉండాల్సిన ఆధారాలు సీఎం చేతికి ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే దవే క్షమాపణ చెప్పిన విషయాన్ని అడ్వొకేట్ సంజయ్ సీజే దృష్టికి తీసుకొచ్చారు.

పోలీసులు బెదిరించిన్రు

అంతకుముందు శ్రీనివాస్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఉదయ్ హుల్లా వాదనలు వినిపించారు. తన క్లయింట్ ఇంట్లో లేని సమయంలో 30మంది పోలీసులు వచ్చి నోటీసు అతికించి వెళ్లారని అన్నారు. పోలీసులు చెప్పినట్లు వినకుంటే నిందితుడుగా చేర్చుతామని బెదిరించిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. అయితే ప్రతివాదుల తరపున ఇవన్ని వాదనలు ఇంతకు ముందే ఇద్దరు సీనియర్ న్యాయవాదులు వినిపించారని..ఏమైనా కొత్త పాయింట్స్ ఉంటే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది.