చంద్రబాబు క్వాష్ పిటిషన్​పై విచారణ వాయిదా

చంద్రబాబు క్వాష్ పిటిషన్​పై విచారణ వాయిదా
  • సోమవారం వింటామన్న సుప్రీం బెంచ్

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఆలోపు హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సుప్రీంకోర్టులో సమర్పించాలని ఏపీ సీఐడీ తరఫు అడ్వకేట్లను ఆదేశించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ ను సవాల్ చేస్తూ.. చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తమ వాదన వినకుండ తీర్పు ఇవ్వొద్దని ఏపీ సర్కార్ సైతం కేవియట్ దాఖలు చేసింది. కాగా మంగళవారం బాబు క్వాష్ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తొలుత వర్చువల్ గా హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుపై దాఖలైన కేసు పూర్తిగా రాజకీయపరమైందన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

హైకోర్టు 17ఏ వర్తించదని చెప్పడం సరికాదన్నారు. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తిస్తుందా?  లేదా అన్న దానిపై విచారణ జరపాల్సి ఉందన్నారు. ఆరోపణలు ముఖ్యం కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే ప్రధానంగా చర్చించాలని నివేదించారు. కేబినెట్ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగమని, ఇలాంటి నిర్ణయాలపై ప్రతీకార చర్యలు నుంచి సెక్షన్ 17ఏ రక్షణ కల్పిస్తోందని సింఘ్వి వాదనలు కొనసాగించారు. ఈ వాదనలను ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి ఖండించారు. 2018  జులైలో చట్ట సవరణ జరిగిందని, 2021 లో ఎఫ్ఐఆర్ నమోదైందని కోర్టుకు వివరించారు. 2017 కు ముందే ఈ కేసులో తప్పు జరిగినందున సెక్షన్ 17ఏ వర్తించదని వాదించారు. మధ్యలో జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకొని.. 2017 కు ముందే అవినీతి జరిగిందనడాని ఏవైన ఆధారాలు ఉన్నాయా? అని రోహిత్గిని ప్రశ్నించారు. అయితే 10 శాతం ప్రభుత్వ సంస్థ, 90 శాతం ప్రైవేటు సంస్థల పేరుతో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని రోహిత్గి బదులిచ్చారు. అయితే కేసు వివరాల్లోకి వెళ్లవద్దని, ప్రస్తుతం కేసు మెరిట్స్ పై విచారణ జరగడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరువైపుల వాదనలు విన్న బెంచ్.. తదుపరి విచారణను సోమవారాని వాయిదా వేసింది.