వార్ రూం కేసు : కాంగ్రెస్ హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ నాలుగు వారాలకు వాయిదా

వార్ రూం కేసు : కాంగ్రెస్ హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ నాలుగు వారాలకు వాయిదా

హైదరాబాద్ : వార్ రూం నుంచి అక్రమంగా అదుపులోకి తీసుకున్న ముగ్గురి జాడ చెప్పాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణలో భాగంగా వాదనలు వినిపించిన కాంగ్రెస్ తరఫు న్యాయవాది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వార్ రూం నుంచి ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 18 గంటల పాటు వారిని అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు 2022 నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదుచేశారని కోర్టుకు విన్నవించారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినట్లు చెప్పారు. 

పోలీసుల వాదనపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది ఎఫ్ఐఆర్ నమోదైన 20 రోజుల అనంతరం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ముగ్గురిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నందుకుగానూ ఒక్కొక్కరికీ రూ.20లక్షల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.