బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. ఇవాళ (అక్టబర్ 08) హైకోర్టులో జీవో 9పై విచారణ.. తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం

బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ.. ఇవాళ (అక్టబర్ 08) హైకోర్టులో జీవో 9పై విచారణ.. తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం
  • ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించనున్న ఏజీ 
  • ఎ.సుదర్శన్‌‌రెడ్డి, సీనియర్‌‌ న్యాయవాది అభిషేక్‌‌ సింఘ్వీ
  • ఇప్పటికే 50 శాతం దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ 
  • రేపే తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్​ 
  • గ్రామాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొలిక్కి

హైదరాబాద్, వెలుగు:
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ నెలకొన్నది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో నంబర్ 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్‌‌ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జీఎం మొహియుద్దీన్లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం (అక్టోబర్ 08) విచారించనున్నది. 

ఎలాగైనా సరే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కారు.. అడ్వకేట్​జనరల్‌‌ ఎ.సుదర్శన్‌‌రెడ్డితోపాటు సుప్రీంకోర్టు సీనియర్‌‌ న్యాయవాది అభిషేక్‌‌ మను సింఘ్వీతో  సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపనున్నది. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం  ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్​, వార్డు మెంబర్ల  ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది. 

దీని ప్రకారం తొలి విడత ఎన్నికల కోసం గురువారం (అక్టోబర్ 09) నోటిఫికేషన్ విడుదల కానున్నది.  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9తో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో కలిపి  మొత్తం రిజర్వేషన్లు 69 శాతానికి చేరుతున్నాయి.   రిజర్వేషన్లు 50 శాతం మించిపోవడంతో.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్​ ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్​ చట్టం –2018లో 285(ఏ)ను సవరించింది. ఈ సవరణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్​ ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్​ వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నది. ‘‘ఈ సవరణ గవర్నర్​ ఆమోదం పొందకుండా జీవో ఇవ్వడం సరైనదేనా? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా ? అలా అమలు చేయొచ్చా ? కోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా?.. ఉంటే వాటిని సమర్పించండి” అని ఇప్పటికే అడ్వకేట్​ జనరల్‌‌‌‌‌‌‌‌కు హైకోర్టు  సూచించింది.

తీర్పుపైనే అందరి దృష్టి..

హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది.  దీనిపై గత విచారణలోనే హైకోర్టు స్పష్టతనిచ్చింది. ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ ప్రకటించినప్పటికీ.. పిటిషన్లను విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే, గురువారమే తొలి విడత నోటిఫికేషన్ రానుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో అభ్యర్థుల కసరత్తు పూర్తి చేశాయి. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ఇప్పటికే చాలావరకు కొలిక్కి వచ్చింది. చాలా చోట్ల నాయకులు టికెట్లు ఆశించేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, తుది జాబితాను సిద్ధం చేసుకున్నారు.  

ఒకవేళ హైకోర్టు  జీవో 9ను నిలిపివేస్తే లేదా కొట్టివేస్తే, బీసీ రిజర్వేషన్ల శాతంలో మార్పులు తప్పనిసరి. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కొత్తగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి వస్తుంది. దీని వల్ల ఇప్పటికే ఖరారైన స్థానాలు, అభ్యర్థుల విషయంలో సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పులు లేకపోయినా బీసీ స్థానాల్లో జనరల్​ రానుంది. వార్డుస్థాయిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తే.. ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో, బుధవారం నాటి హైకోర్టు విచారణపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయనాయకులు, అభ్యర్థులు, ఓటర్లు దృష్టి సారించారు. 

గ్రీన్​సిగ్నల్​ వస్తే చరిత్రాత్మకమే

బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చరిత్రాత్మకం కానున్నది.  దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్లినట్లు ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను, నివేదికలను, జీవోలను సిద్ధం చేసుకున్నది.  ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లతో  మొత్తం పరిమితి 50 శాతం దాటిందని ప్రభుత్వం వాదించనున్నది. 

కృష్ణమూర్తి కేసు తీర్పులో  ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేయనున్నది. ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్​ ప్రభుత్వం 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్‌‌‌‌కు పంపింది. గవర్నర్​ దానిని రాష్ట్రపతికి పంపారు. అయితే, అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకోసం జీవో ఇచ్చినట్లు తెలియజేసే అవకాశం ఉన్నది.