ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనపై బీజేపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే టీఆర్ఎస్ కుట్ర చేసిందని తెలిపారు. సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో ఈ కేసుని సమగ్రంగా విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారించనుంది.

అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. నిందితుల కుట్రను భగ్నం చేసేందుకు తాము స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు కోర్టుకు వెల్లడించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనను రికార్డ్ చేసేందుకు మొయినాబాద్ ఫాం హౌజ్ లో 4 స్పై కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు అమర్చినట్లు కోర్టుకు తెలిపారు. మధ్యాహ్నం 3.5 గంటలకు  కెమెరాలను ఆన్ చేశామని,  3.10 గంటలకు నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి హాల్లోకి వచ్చారని పోలీసులు వెల్లడించారు.

సాయంత్ర 4.10కి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు వచ్చారని పేర్కొన్నారు. సుమారు మూడున్నర గంటలపాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారని, తమ ప్లాన్ ప్రకారం మీటింగ్ పూర్తవగానే కొబ్బరి నీళ్లు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  సిగ్నల్ ఇచ్చారని వెల్లడించారు. దీంతో తాము వెంటనే హాలులోకి ప్రవేశించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.