
- సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారమే సిట్ విచారిస్తోంది
- దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని నిందితుల తరఫు పిటిషనర్ల వినతి
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీలకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలతో పార్టీ పిరాయింపులకు ప్రోత్సహించిందని సీనియర్ అడ్వకేట్, కర్నాటక మాజీ ఏజీ ఉదయ్ హోల్లా హైకోర్టు దృష్టికి తెచ్చారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుందని తెలిపారు. పార్టీ పిరాయింపులకు పెద్ద పీట వేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు వేరే వాళ్లు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి లేదా ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ జరిపారు. బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, కరీంనగర్ అడ్వకేట్ భూసారపు శ్రీనివాస్ తదితరులు పిటిషన్లు వేశారు. శీనివాస్ తరఫున ఉదయ్ వాదనలు వినిపించారు.
సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి..
ఈ కేసుతో శ్రీనివాస్‌కు సంబంధం లేదని, అయినా విచారణ పేరుతో సిట్ వేధించిందని ఉదయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి చేసిందన్నారు. రోజుకు 10 గంటల చొప్పున సిట్ చేసిన విచారణను వీడియో తీశారని, దీనికి చెందిన సీడీ ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. రాష్ట్రంలో గవర్నర్ ఫోన్లే ట్యాపింగ్ అవుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా గవర్నరే ప్రకటించారని గుర్తుచేశారు. పోలీసుల ఇష్టారాజ్యం నడుస్తోందని చెప్పడానికి షర్మిల కారులోనే ఉండగా క్రేన్‌తో గుంజుకెళ్లిన ఘటనే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తును సిట్ కొనసాగిస్తే ఫలితాలు కక్షసాధింపులకు అనుగుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేందుకు సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక బృందానికి బదిలీ చేయాలని కోరారు. సిట్ దర్యాప్తు మొత్తం సీఎం కేసీఆర్ కనుసన్నల్లో జరగుతోందన్నారు. సీఎం కూడా మీడియా సమావేశంలో ఆ ఘటన గురించి చెప్పడమే కాకుండా ఆడియో, ఇతర కీలక ఎవిడెన్సులు పెన్‌డ్రైవ్, సీడీలలో హైకోర్టు సీజేలు, సుప్రీంకోర్టు జడ్జీలకు సీల్డ్ కవర్‌లో పంపారని చెప్పారు. ఎవిడెన్సులను పోలీసులు సీజ్ చేసిన తర్వాత అవన్నీ ఎలా బయటకు వచ్చాయనే కోణంలో చూస్తే దర్యాప్తు సీబీఐకి బదిలీ చేయడమే కరెక్ట్ అవుతుందన్నారు. సిట్ తరఫున అదనపు ఏజీ జె. రాంచందర్ రావు వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారుడు పైలట్ రోహిత్‌రెడ్డి మెటీయల్‌ను మీడియాకు ఇచ్చి ఉండొచ్చునని అన్నారు. అయినా, కోర్టు కేసుల్లోని వాదప్రతివాదులందరికీ మొత్తం వివరాలను అందజేశామని, మెటీయల్ ఎవరి నుంచైనా మీడియాకు చేరవచ్చునని చెప్పారు. తదుపరి విచారణ ఈ నెల 9 కి వాయిదా పడింది. కాగా, తదుపరి విచారణలో నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించనున్నారు.