- గత ఐదేండ్లలో గుండె జబ్బులకే సుమారు రూ. వెయ్యి కోట్లు
- జీవనశైలి మార్పులే గుండెజబ్బులకు ప్రధాన కారణం
- నివారణపై అవగాహన పెంచాలంటున్న నిపుణులు
హైదరాబాద్, వెలుగు: పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకానికి గుండె జబ్బులు ఆర్థిక భారంగా మారుతున్నాయి. గత ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా వివిధ వ్యాధుల చికిత్సల కోసం రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా.. అందులో మూడో వంతు అంటే దాదాపు రూ. వెయ్యి కోట్లు కేవలం గుండె సంబంధిత చికిత్సలకే చెల్లించింది. ఇది రాష్ట్రంలో గుండె జబ్బుల తీవ్రతకు, వాటి చికిత్సకు అవుతున్న భారీ వ్యయానికి అద్దం పడుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న టాప్ 20 వ్యాధులలో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీలు కూడా ఉండటం ఇందుకు నిదర్శనం.
ఖర్చుల లెక్కల్లో టాప్ ప్లేస్
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆరోగ్యశ్రీ నిధులు ఏ స్థాయిలో గుండె చికిత్సలకు వెళ్తున్నాయో స్పష్టమవుతోంది. 2020 నుంచి ఇప్పటివరకు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద జరిగిన చికిత్సల జాబితాలో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్లు అగ్రస్థానంలో నిలిచాయి. ఒక్క కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోనే 1,09,537 కేసులకు గాను ప్రభుత్వం ఏకంగా రూ. 629.74 కోట్లు ఖర్చు చేసింది.
ఆరోగ్యశ్రీ కింద అత్యధిక క్లెయిమ్స్ నమోదైన విభాగాల్లో ఇది ఒకటి. అలాగే, గుండెకు సంబంధించిన మేజర్ ఆపరేషన్లు జరిగే కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో 27,730 కేసులకు రూ. 286.04 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ రెండు విభాగాలకు కలిపి దాదాపు రూ. 916 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అంటే, ఆరోగ్యశ్రీ మొత్తం బడ్జెట్‌లో సింహభాగం గుండె జబ్బులకే పోతోంది. ఈ రెండు డిపార్ట్మెంట్లలో ఒక్కో చికిత్సకు సగటున రూ. 66 వేలు ఖర్చు అవుతోంది.
నివారణే రక్ష
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత ఖర్చు చేసినా, వ్యాధుల తీవ్రత తగ్గనంత కాలం ఈ భారం తప్పదు. అందువల్ల వ్యాధుల నివారణపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
సరైన ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలతో గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి, నివారించుకోవచ్చు. ప్రభుత్వం కూడా నివారణ చర్యలపై దృష్టి సారిస్తేనే ఆరోగ్యశ్రీ పథకంపై పడుతున్న గుండె చికిత్సల భారాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకింత భారం?
గుండె చికిత్సలకు అయ్యే ఖర్చు మిగతా వ్యాధులతో పోలిస్తే చాలా ఎక్కువ. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు. యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీలలో వాడే స్టెంట్లు, పేస్ మేకర్లు, ఇతర పరికరాలు చాలా ఖరీదైనవి. వీటిని ఇంపోర్టు చేసుకోవాల్సి రావడంతో వ్యయం పెరుగుతోంది. అలాగే, గుండె ఆపరేషన్ల కోసం ప్రత్యేకమైన క్యాథ్ ల్యాబ్ లు, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల వంటి హై-ఎండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం.
వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువ. అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్ల ఫీజులు అధికంగా ఉండటం కూడా చికిత్స వ్యయాన్ని పెంచుతోంది. గుండె ఆపరేషన్ల తర్వాత రోగులు కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుండడంతో వారికి అందించే ఐసీయూ కేర్, మందులకూ భారీగా ఖర్చవుతోంది.
