ఇంటి ముందు ఆడుకోవడమే ఈ చిన్నారి చేసిన పాపమా..? హైదరాబాద్లో కుక్కలు ఎలా దాడి చేశాయో చూడండి

ఇంటి ముందు ఆడుకోవడమే ఈ చిన్నారి చేసిన పాపమా..? హైదరాబాద్లో కుక్కలు ఎలా దాడి చేశాయో చూడండి

హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ వెనుక శ్రీనివాస్ నగర్లో ఓ చిన్నారిపై కుక్కల దాడిలో చిన్నారి గాయపడిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఇంటి ముందు అడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం బంజారాహిల్స్లోని రెయిన్ బో ఆసుపత్రిలో చిన్నారి శార్వికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి యూకేజీ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు. 

హైదరాబాద్ సిటీలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. కుక్కలు కరవడమే కాకుండా చిన్నారులను చంపేస్తున్న  ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా  పిల్లల మీద  శునకాల  దాడులు  దేశమంతటా ఎక్కువ అవడం  ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం  నుంచి ఈ సమస్యకు పరిష్కారం  ఆశిస్తున్న ప్రజల సంఖ్య కూడా పెరిగింది.

హైదరాబాద్ నగరంలో చాలా కాలనీల్లో రాత్రయితే చాలు కుక్కలు వీర విహారం చేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతూ  కనిపించిన వారిపై మూకుమ్మడిగా వేటాడి కరుస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని  జంక్షన్లు, మురుగు కాలువలు, చెత్తకుప్పల వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లే వారిని వదలకుండా దాడులు చేస్తున్నాయి.

కుక్కల దాడుల్లో అనేకమంది చిన్నారులు, మహిళలు గాయాలపాలవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు  కూడా ఉన్నాయి.  బైక్లపై వెళ్లే వారి వెంట బడడంతో అదుపుతప్పి ప్రమాదాలు  జరుగుతున్నాయి.