
అదో చిన్న పల్లెటూరు.. వాళ్లది సామాన్య వ్యవసాయ కుటుంబం.. అందులో ఒక బాలుడు ఇరవై మూడేళ్ల క్రితం మిస్సయ్యాడు. ఎక్కడెక్కడ తిరిగాడో.. ఎలా గడిపాడో కానీ.. ఒక సంస్థ వలన మళ్లీ స్వగ్రామానికి చేరుకోగలిగాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చి చూస్తే తల్లీ, తమ్ముడు లేరని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరికి చెందిన కొత్తపాటి నడిపి లింగన్న, మల్లవ్వ దంపతులకు వ్యవసాయం జీవనాధారం. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు వారి సంతానం. కుమార్తెల వివాహాలు చేశారు.
కుమారుడు మల్లయ్య ఎనిమిదో తరగతి మధ్యలో చదువు మానేశాడు. 17 ఏళ్ల వయసులో మతిస్థిమితం లేక.. 2002లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోయింది.
2021లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్ సభ్యులకు మల్లయ్య కేరళలో కనిపించగా ఆశ్రయమిచ్చారు. ముంబయిలోని ఆ సంస్థ ఆసుపత్రిలో నాలుగేళ్లపాటు మానసిక వైద్యం చేయించారు. అతడి మానసికస్థితి కొంత కుదుటపడడంతో తన ఊరు, సమీప పట్టణాల పేర్లు చెప్పగలిగాడు. దీంతో సంస్థ ప్రతినిధి సిద్దు. . ఆదివారం (ఆగస్టు 03) మల్లయ్యను తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇంటికి రాగానే మల్లయ్య తన అక్కలు, బావలను గుర్తుపట్టి పలకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఆరేళ్ల కిందట తల్లి మల్లవ్వ, ఏడాది క్రితం తమ్ముడు రాజు మృతి చెందారని తెలుసుకుని మల్లయ్య కంటతడి పెట్టాడు. ఇప్పుడు అక్కాబావలే తనకు తోడూ నీడ. మల్లయ్య తిరిగి రావడంత అక్కలు, బావల ఆనందానికి అవధులు లేవు. బంధువులు, గ్రామస్తులు మల్లయ్యను చూసేందుకు వచ్చి ఆనందం వ్యక్తం చేశారు.