భైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ లో వాడీవేడిగా భైంసా మున్సిపల్ మీటింగ్

భైంసా పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ లో వాడీవేడిగా భైంసా మున్సిపల్ మీటింగ్
  •     అరుపులు, కేకలతో దద్దరిల్లిన కౌన్సిల్​ హాల్​

భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్​ఆఫీస్​ లో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం అరుపులు, కేకలతో వాడీవేడిగా సాగింది. చైర్మన్​ తూమొల్ల దత్తాత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం పాలకవర్గం, ఎంఐఎం వర్గాల మధ్య వాగ్వాదం, నిలదీతలు, వాదులాటల మధ్య కొనసాగింది. తమ ఎజెండాలోని ఇండస్ట్రియల్ ​జోన్​లోని స్థలాలను రెసిడెన్షియల్​ జోన్​లోకి మార్చే అంశంపై ఎంఐఎం కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. సంబంధిత అంశాన్ని రెగ్యులర్​ ఎజెండాలో పొందపర్చాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను కౌన్సిలర్ల ప్రమేయం లేకుండా నిర్వహించడం సరికాదని ఆరోపిచారు. 

పారిశుధ్య నిర్వాహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పాలకవర్గం, ఎంఐఎం కౌన్సిలర్ల వాగ్వాదం చెలరేగింది. పెద్దఎత్తున అరుపులు, కేకలు వినడంతో కింత అంతస్తులో ఉన్న మున్సిపల్​ సిబ్బంది, అధికారులు, అంతస్తులోని కౌన్సిలర్​ హాల్​కు పరుగులు పెట్టారు.  చర్చోపచర్చల మధ్య రెగ్యులర్​ఎజెండాలోని అంశాలపై ఆమోద ముద్ర వేయగా టేబుల్​ ఎజెండాలోని రెండు అంశాల్లో ఒకదాన్ని వ్యతిరేకించారు. సమావేశంలో వైస్​ చైర్ పర్సన్​ బీబీ ఖుతిజా సిద్ధికి, కమిషనర్​ లింగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.