కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. అంజన్న క్షేత్రంలో భారీ రద్దీ

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు.. అంజన్న క్షేత్రంలో భారీ రద్దీ

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మే 30న శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే ఆలయ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. అంజన్న నామస్మరణ చేస్తూ దర్శన క్యూలైన్లలో వేచి ఉన్నారు. అనంతరం క్షేత్రపాలకుడైన శ్రీ బేతలస్వామిని కూడా దర్శించుకుని భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.

శనివారం ఒక్కరోజే ఆలయానికి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు విచ్చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామివారికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు రంగయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ముఖ్య అర్చకులు చిన్న మారుతి, పెద్ద రాము, పవన్,  అభిలాష్‌లు పాల్గొని భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందిస్తూ తమ సేవలను అందించారు.

ALSO READ : వృశ్చిక రాశిలో 'బ్లూ మూన్'

భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏఈఓ హరిహర్నాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్‌లు భక్తుల సౌకర్యాలను సమీక్షించగా.. టెంపుల్ ఇన్స్పెక్టర్లు అశోక్, శ్రీనివాస్‌లు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమన్వయం చేశారు. క్యూలైన్లలో నెట్టివేతలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.