శ్రీశైలానికి భారీ వరద.. 20 టీఎంసీలకు పైగా పెరిగిన నీటి నిల్వ

శ్రీశైలానికి భారీ వరద..  20 టీఎంసీలకు పైగా పెరిగిన  నీటి నిల్వ

కృష్ణానదికి క్రమంగా వరద పెరుగుతున్నది. జూరాల గేట్లు ఎత్తడంతో శ్రీశైలంలో నీటి నిల్వ 20 టీఎంసీలకు పైగా పెరిగింది.  శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 837 అడుగుల నీటిమట్టం ఉంది. జలాశయానికి  లక్షా 51 వేల క్యూసెక్కుల నీరు చేరుతున్నది. కృష్ణా బేసిన్​లో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్​లో ఎస్సారెస్పీకి వరద తగ్గడంతో గేట్లు మూసేశారు. కడెం ప్రాజెక్టుకు వరద తగ్గినా రెండు గేట్లు తెరిచి నీటిని కిందికి వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 55.50 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్, శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తున్నది. జూరాల గేట్లు ఎత్తడంతో 36 గంటల్లోనే శ్రీశైలంలో నీటి నిల్వ 20 టీఎంసీలకు పైగా పెరిగింది. శనివారం సాయంత్రానికి ఈ ప్రాజెక్టులో 59 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జలాశయానికి 1లక్షా 51వేల క్యూసెక్కుల నీరు చేరుతున్నది. కృష్ణా బేసిన్​లో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఎస్సారెస్పీకి వరద తగ్గడంతో గేట్లు మూసేశారు. కడెం ప్రాజెక్టుకు వరద తగ్గినా రెండు గేట్లు తెరిచి నీటికి కిందికి వదిలేస్తున్నారు. ఎల్లంపల్లికి 2.81 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా గేట్లు ఎత్తి 2.95 లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. మేడిగడ్డకు 10.80 లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడానికి 14.15 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. భద్రాచలం వద్ద గోదావరి 55.50 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.
 
శ్రీశైలం పవర్ ప్లాంట్ యూనిట్-4 అందుబాటులోకి

శ్రీశైలం జలవిద్యుత్​ కేంద్రంలోని -4వ యూనిట్ మూడేండ్ల తరువాత శనివారం అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 20, 2020లో శ్రీశైలం ప్లాంటులో జరిగిన ప్రమాదంలో 4వ యూనిట్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు 9మంది ఇంజినీర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. 150 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఈ యూనిట్​కు రిపేర్లు చేసి ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు.

అలుగు పోస్తున్న చెరువులు

రాష్ట్రంలో 18 వేలకు పైగా చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. కొత్తగూడెం, నిజామాబాద్, ములుగు వరంగల్​ చీఫ్ ​ఇంజనీర్ల​ పరిధిలోని అన్ని చెరువులు పూర్తిగా నిండాయి. ఆదిలాబాద్, రామగుండం, జగిత్యాల, కామారెడ్డి సీఈల పరిధిలో 90 శాతానికి పైగా చెరువులు పూర్తిగా నిండాయి. నాగర్​కర్నూల్​ సీఈ పరిధిలో మూడు చెరువులు మాత్రమే మత్తడి దుంకుతున్నాయి. ఇక్కడ 60 శాతానికి పైగా చెరువుల్లో పావు వంతు నీళ్లు మాత్రమే ఉన్నాయి. మహబూబ్​నగర్​ సీఈ పరిధిలో సగం చెరువుల్లో 50 శాతం లోపే నీళ్లున్నాయి. ఇక్కడ 89 చెరువులు మాత్రమే అలుగు పోస్తున్నాయి. నల్గొండ సీఈ పరిధిలో 18 చెరువులు మాత్రమే పూర్తిగా నిండగా సగానికి పైగా చెరువుల్లో పావు వంతు నీళ్లు మాత్రమే ఉన్నాయి. వనపర్తి సీఈ పరిధిలో 45 చెరువులు పూర్తిగా నిండగా వెయ్యికి పైగా చెరువుల్లో సగం నీళ్లు మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి సీఈ పరిధిలో 40 శాతం చెరువులు పూర్తిగా నిండాయి. సూర్యాపేట సీఈ పరిధిలో సగానికి చెరువులు మత్తడి దుంకుతున్నాయి. రాష్ట్రంలో 34,618 చెరువులు ఉండగా అందులో 18,490 చెరువులు అలుగు పోస్తున్నాయి. 

సంగమేశ్వరాలయంలో ఈ ఏడాదికి చివరి పూజలు

కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో శుక్రవారం రాత్రికి సంగమేశ్వరాలయంలోని వేపదారు శివలింగాన్ని జలాలు తాకనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆలయ అర్చకులు గంగమ్మకు చీర సారే సమర్పించి ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 837 అడుగుల నీటిమట్టం ఉంది. ఇది 85O అడుగులకు చేరుకుంటే ఆలయం పూర్తిగా మునిగిపోతుంది.