
బళ్లారి: తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఎగువన పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదిలో వరద పోటెత్తుతోంది. వరద పరవళ్లతో తుంగభద్ర డ్యామ్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1631.45 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 95.53 టీఎంసీలు ఉంది.
సీజన్లో తొలిసారిగా 33 గేట్లు ఎత్తివేత
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఈ సీజన్లో తొలిసారిగా తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తి నీటివిడుదల ప్రారంభించారు. ప్రస్తుతం డ్యామ్ కు ఎగువ నుంచి 1 లఖ్సా 48వేలకు పైబడిన వరద వస్తుండగా.. డ్యామ్ 33 గేట్లు ఎత్తి 1లక్షా 31 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదిలో భారీ ఎత్తున వరదనీటిని విడుదల చేస్తున్న నేపధ్యంలో దిగువన నది పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద తుంగభద్ర వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. మంత్రాలయం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భక్తులు స్నానానికి నదిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఎగువ నుండి వరద పోటెత్తుతుండడంతో కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.