విమానం ముక్కు పగిలింది.. 227 మందికి గుండె ఆగినంత పనైంది.. అసలేం జరిగిందంటే..

విమానం ముక్కు పగిలింది.. 227 మందికి గుండె ఆగినంత పనైంది.. అసలేం జరిగిందంటే..

శ్రీనగర్: ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమానంలో( IndiGo flight 6E 2142) ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా ఉన్నట్టుండి వడగళ్ల వర్షం కురిసింది. పెద్ద పెద్ద వడగళ్లు ఎవరో రాళ్లతో కొట్టినట్టే విమానంపై పడ్డాయి. వడగళ్ల దెబ్బకు విమానం ముందు భాగం గాల్లోనే ధ్వంసమైంది. ఈ విమానంలో 227 మంది ప్రయాణికులు ఉండగా ఈ ఘటన జరిగింది. ఏ బాంబో మీదొచ్చి పడిందని ప్రయాణికులు హడలెత్తిపోయారు.

పైలట్తో పాటు క్యాబిన్ క్రూ అప్రమత్తంగా వ్యవహరించి.. ప్రయాణికులకు ధైర్యం చెప్పి శ్రీనగర్ విమానాశ్రయంలో సాయంత్రం 6.30 సమయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ విమానం ల్యాండ్ అవగానే ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఈ హఠాత్ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో విమానం ముక్కు పగిలింది.. అదేనండీ ముందు భాగానికి వడగళ్ల దెబ్బకు చిల్లు పడింది.

2023లో కూడా ఇండిగో విమానానికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో ఫ్లైట్ నంబర్ 6E 6594 వడగళ్ల వాన దెబ్బకు పాక్షికంగా ధ్వంసమైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే 27Lపై విమానం సేఫ్గా ల్యాండ్ అయింది. అయితే.. విమానం ముందు భాగం, రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విమానం గాల్లో ఉండగా ఇలాంటి ఘటనలు జరిగితే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనక తప్పదు. తాజా ఘటనలో.. ఇండిగో విమానానికి ఏం జరిగిందో ఇండిగో యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది.