పాకిస్తాన్లో సింధు జలాల గొడవ.. హోం మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు.. నెట్టింట వీడియోలు వైరల్

పాకిస్తాన్లో సింధు జలాల గొడవ.. హోం మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు.. నెట్టింట వీడియోలు వైరల్

పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇండియాపై యుద్ధానికి సిద్ధమని బీరాలు పలికిన దాయాది దేశం అంతర్యుద్ధంతో అల్లాడిపోతుంది. బలూచిస్తాన్ ఇప్పటికే స్వతంత్ర దేశంగా ప్రకటించుకోగా, ఇప్పుడు మరో వివాదం పాకిస్తాన్లో మంటలు రాజేసింది. సింధు నదిపై ఆరు ప్రాజెక్టులు నిర్మించి ఎడారి ప్రాంతమైన చోలిస్తాన్ ప్రజలకు తాగు నీరు అందించాలని పాకిస్తాన్లోని సమాఖ్య ప్రభుత్వం భావించింది. చోలిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉంది.

తాగునీళ్లు దొరక్క అక్కడి జనానికి గొంతెండిపోతున్న పరిస్థితులున్నాయి. దీంతో.. వాళ్లకు తాగు నీరు అందించేందుకు సింధు నది నీళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అయితే.. ఈ నిర్ణయాన్ని సింధ్ ప్రభుత్వంతో పాటు నేషనలిస్ట్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి. సింధ్ ప్రావిన్స్ నీటి హక్కులకే ముప్పు ఏర్పడుతుందని, వ్యవసాయానికి సాగు నీరు లేకుండా పోతుందని నిరసనకారులు రోడ్డెక్కారు. ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కొందరు ఆందోళనకారులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు.

హోం మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మోరోలో ఉన్న సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. నిరసనలకు దిగిన మూకలు నేషనల్ హైవేపై లారీలను అడ్డగించి దొరికినవి దోచుకున్నారు. ఈ యాంటీ కెనాల్ ఆందోళనలు పాకిస్తాన్లో ఉన్న అధ్వాన పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

ALSO READ | పాకిస్థాన్ ఏజెంట్స్ ని కలిసింది నిజమే... జ్యోతి మల్హోత్రా ఒప్పేసుకుంది.. !