
న్యూఢిల్లీ: వక్ఫ్‌సవరణ చట్టం–2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కాగా, వక్ఫ్ సవరణ చట్టంలోని వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ కౌన్సిల్, స్టేట్ వక్ఫ్ బోర్డులకు ముస్లిమేతరుల నామినేషన్, వక్ఫ్ కింద ప్రభుత్వ భూముల గుర్తింపు వంటి నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం మూడు రోజుల పాటు అన్ని వైపుల నుంచి వాదనలు విని.. గురువారం (మే 22) ఈ పిటిషన్లపై విచారణ ముగించింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించగా.. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. వక్ఫ్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ చట్టం ఉద్దేశమని పిటిషనర్ల తరఫు లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ.. అది కేవలం చారిటీ (దాతృత్వం) మాత్రమేనని, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు.
మతానికి సంబంధం లేని విధులను మాత్రమే వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయని, అందువల్ల ఆబోర్డుల్లో ముస్లింయేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతించవచ్చని వాదించారు. అలాగే ప్రభుత్వానికి చెందిన భూములు తమవేనని ఎవరూ ప్రకటించుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం వక్ఫ సవరణ చట్టంపై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పిటిషన్లరకు అనుకూలంగా తీర్పు వస్తుందా..? లేక కేంద్ర ప్రభుత్వ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా..? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.