 
                                    - జలదిగ్బంధంలో వరంగల్ ట్రైసిటీ
- ఆరు జిల్లాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం
- వరదల్లో పలువురి గల్లంతు
- తెగిన చెరువు కట్టలు, రోడ్లు.. నిలిచిన రాకపోకలు
వరంగల్/ హనుమకొండ/ జనగామ/ మహబూబాబాద్/ ములుగు/ జయశంకర్భూపాలపల్లి, వెలుగు: మొంథా తుఫాన్ విధ్వంసానికి ఓరుగల్లు అతలాకుతలమైంది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వానకు వరంగల్ ట్రైసిటీ జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరదల్లో పలువురు గల్లంతయ్యారు. పెద్ద మొత్తంలో పంట నష్టం వాటిల్లింది.
పలుచోట్ల చెరువు కట్టలు తెగిపోవడంతో ఇండ్లు, పంట పొలాల్లోకి నీరు చేరింది. రోడ్లపై వరద పోటెత్తడంతో కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జీవాలు మృతిచెందాయి. కాగా, నష్టపోయిన ప్రాంతాలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, పంటలు నష్టపోయిన వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.
వరంగల్ జిల్లాలో భారీగా పంట నష్టం
వరంగల్ ట్రైసిటీని జలదిగ్బంధం చేసిన మొంథా తుఫాన్ అంతే స్థాయిలో రూరల్ మండలాల్లోనూ దెబ్బతీసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు నర్సంపేట, పర్వతగిరి, వర్ధన్నపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాల్లో పంట నష్టం జరిగింది. వరి, పత్తి, అరటి తోటలతో పాటు కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్దదైన పాకాల చెరువు మత్తడి దుంకుతోంది. నెక్కొండ మండలం సూరిపల్లిలో 25 గొర్రెలు మృతిచెందాయి.
హనుమకొండ జిల్లాలో 34,718 ఎకరాల పంట నష్టం..
మొంథా తుఫాన్ రాష్ర్టంలోనే అత్యధికంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 40.6 సెం.మీ, వేలేరులో 31.3 సెం.మీల వర్షాపాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలోని కాలనీలను వరద నీరు ముంచెత్తగా, రూరల్ ఏరియాలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో నార్త్ వైపు ఉన్న స్పిల్ వే గేట్లు ఎత్తగా, ఆ వరద ప్రవాహానికి దేవునూరు గ్రామం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో మొత్తంగా 34,718 ఎకరాల్లో పంట నష్టం జరగగా, అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు.
పత్తి అత్యధికంగా ధర్మసాగర్ మండలంలో 317 ఎకరాలు డ్యామేజ్ కాగా, మొక్కజొన్న 150 ఎకరాల మేర దెబ్బతింది. రూరల్ జిల్లాలో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శంభునిపల్లి స్కూల్ తో పాటు ఉప్పల్లో రైల్వే ట్రాక్ పై వరద నీరు నిలిచింది. కమలాపూర్ చెరువు మత్తడి నీటిలో కారు కొట్టుకుపోతుండగా, స్థానికులు కారును, అందులోని వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
  పిడుగుపాటు, వరదలకు జిల్లాలో 40కి పైగా పశువులు, 7 వేలకు పైగా కోడిపిల్లలు మృత్యువాతపడ్డాయి. సుమారుగా 15 ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.  
జనగామ జిల్లాలో 25 వేల ఎకరాల్లో నష్టం  జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తంగా 25 వేలకుపైగా ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో వరి పంట 18,320 ఎకరాలు, పత్తి 6,445 ఎకరాలు, 240 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.  
వరి రైతుకు కన్నీరే..
మానుకోట జిల్లాలో మొంథా తుఫాన్ రైతుకు కన్నీరే మిల్చింది. జిల్లాలో మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగుల వెంట వరి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మానుకోట జిల్లాలో వరి 16,617 ఎకరాల వరి పంట నీట మునిగింది. పత్తి 8782 ఎకరాలు, మక్కలు 65 ఎకరాలు, మిర్చి 565 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.
మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలం గాజుల గట్టు గ్రామంలో మట్టి గోడ కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న కోలరామక్క (80) అక్కడికక్కడే మృతి చెందింది. మహబూబాద్ మండలం కంబాలపల్లికి చెందిన సంపత్(25) బంధువులను వాగు దాటించే క్రమంలో బైక్పై వాగులో కొట్టుకపోవటంతో నేటికీ ఆయన ఆచూకీ లభించలేదు ఎన్టీఆర్ బృందాలు గాలిస్తున్నాయి. తొర్రూరు_ నర్సంపేట, తొర్రూరు_ మహబూబాబాద్, గార్ల_ మహబూబాబాద్ రోడ్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పరిశీలించారు. తొర్రూర్ నుంచి అమలాపురం వెళ్లే బీటీ రోడ్డు కల్వర్టు వద్ద తీవ్రంగా దెబ్బ తినడంతో పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో కొనసాగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు.
నేలవాలిన వరిపైరు
ములుగు జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం పంటలపై ప్రభావం తీవ్రంగా పడింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అత్యధికంగా 8 సె.మీ, ములుగులో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా ములుగు, మల్లంపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరిపైరు దెబ్బతిన్నది. ఏటూరునాగారం, వెంకటాపూర్, మంగపేట మండలాల్లో సైతం వర్షంతో కూడిన గాలిదుమారంతో వరి నేలవాలింది.
ఉప్పొంగిన పెద్దవాగు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మొగుళ్లపల్లి మండలంలో పెద్దవాగు పొంగిపొర్లుతోంది. గుడిపాడు, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిపైకి వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముల్కలపల్లి, కొర్కిశాల రోడ్డుపక్కన పెద్దవాగు, చిన్నవాగుల ప్రవాహం పెరిగింది. వాగు పరివాహక ప్రాంతాల్లోని కోత దశలో ఉన్న వరి పొలాలు పూర్తిగా నీటిపాలయ్యాయి. మొగుళ్లపల్లి, రేగొండ, కాటారం పరిధిలో రాత్రి అధిక వర్షపాతం నమోదైంది. పత్తి, మిరప, కూరగాయలతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాకతీయులు నిర్మించిన గణపసముద్రం సరస్సు మత్తడిపడింది.

 
         
                     
                     
                    