 
                                    - నవంబర్ 3 నుంచి 10 వరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలులో ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కీలక ‘యాక్షన్ ప్లాన్’ను ప్రకటించింది. ఈ రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా కోర్టు వివాదాల నుంచి రక్షించాలని సమితి డిమాండ్ చేసింది.
ఇందులో భాగంగా నవంబర్ 3 నుంచి 10 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విస్తృత కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 10న కామారెడ్డిలో మహా సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గురువారం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో జస్టిస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి, విశారదన్ మహారాజు ఈ కార్యాచరణను ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ సమస్య తెలంగాణ సమస్య అని, రాష్ట్ర సంపద సృష్టిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ 42 శాతం రిజర్వేషన్‌పై స్పష్టమైన వాగ్దానం చేయాలన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీల్లో ముస్లింలు ఉన్నారని, దీన్ని స్థానిక బీజేపీ సమస్యగా చెబుతున్నదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నవంబర్ 3న మండల స్థాయి సమావేశాలు, మండల అధికారులకు 42 శాతం రిజర్వేషన్‌పై వినతి పత్రాలు అందిస్తామన్నారు. 4న జిల్లా స్థాయి ఆందోళనలు చేసి, జిల్లా అధికారులకు వినతి పత్రాలు అందిస్తామని తెలిపారు. నవంబర్ 6న రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి ని కలిసి మెమోరాండం ఇస్తామన్నారు.
7న ఉమ్మది పది జిల్లాల బీసీ సంఘాల సమన్వయ సమావేశం నిర్వహించి, నాయకులతో కలిసి పోరాట వ్యూహాలు రూపొందిస్తామన్నారు. నవంబర్ 10న కామారెడ్డిలో మహా సభ ఏర్పాటు చేసి, మిగతా కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బాలగోని బాలరాజు మాట్లాడుతూ.. కామారెడ్డి సభ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలన్నారు. ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 
         
                     
                     
                    