
హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. శుక్రవారం (జులై 18) మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన వానకు నగరమంతా తడిసిముద్దయ్యింది. అంబర్ పేట ఏరియాలో భారీ వర్షం కురిసింది. దీంతో బతుకమ్మ కుంట లోని భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరింది. బతుకమ్మ కుంటకు ఇటీవలే మరమ్మత్తులు నిర్వహించింది. ఈ ఏడాది బతుకమ్మ సంబరాలు అధికారికంగా అక్కడే నిర్వహించాలని భావిస్తోంది. ఇవాళ కురిసిన వర్షానికి బతుకమ్మ కుంటకు జలకళ వచ్చిచేరింది.
అంబర్ పేటతో పాటు దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక భారీ వర్షానికి మల్కాజ్ గిరి నియోజకవర్గం జలమయం అయ్యింది. ఓల్డ్ మిర్జాల్ గూడ చిన్మయి స్కూల్ ప్రాంతంలో చిన్నపాటి వర్షానికి అపార్ట్మెంట్ లోకి, ఇండ్లల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. దీంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
బోయిన్ పల్లిలో అత్యధికగా 9.3 సెం.మీ. వర్షం నమోదైంది. బండ్లగూడలో 9.18 సెంమీ వర్షం కురిసింది. 11 ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మారేడ్ పల్లిలో 7.6 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 7.35 సెంటీమీటర్లు, ఉప్పల్ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్, బండ్లగూడ, బాలానగర్, అంబర్ పేట్, సైదాబాద్ ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. హయత్ నగర్, హిమాయత్ నగర్, బండ్లగూడ ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ నగరంలో మరో 3 రోజుల పాటు వానలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. 19వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 20వ తేదీన నగరంలోని పలు చోట్ల మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉంది. 21వ తేదీన మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.