
వరద గోదారి వరంగల్ జిల్లాను అతలకుతలాం చేస్తోంది. జిల్లాలోని వాజేడు మండలంలో కొన్ని గ్రామాలు వరద నీటిలోనే మునిగిపోయాయి. వరద ఉధృతికి వాజేడు-గుమ్మడిదొడ్డి, కోయవీరాపురం రహదారులు మూడు రోజులుగా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం తగ్గినా వాగులకు పోటు తగ్గలేదు. కొంగాలవాగు, చాకిరేవువాగుల కారణంగా రహదారులపై వరద నీరు చేరింది. గోదావరి వరద పోటు నెమ్మదిగా తగ్గుతున్నా రహదారులపై వరద నీరు తొలగిపోలేదు. కోయవీరాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్థులు కాలినడకన గుట్ట సమీపం నుంచి చీకుపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
పేరూరు, చండ్రుపట్ల, కృష్ణాపురం ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు కొంగాలవాగు వంతెనపై వరద నీరు చేరడంతో అదనంగా పది కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. గుమ్మడిదొడ్డి మీదుగా మండల కేంద్రానికి రావాల్సిన వాహనాలు జగన్నాథపురం నుంచి రావాల్సి వస్తోంది. జగన్నాథపురం నుంచి కార్యాలయాలకు వస్తున్న ప్రయాణికులకు, ప్రజలకు అదనంగా ఆర్థిక భారం పెరుగుతోంది.