
మెదక్: పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో గుండు వాగు ఉధృతంగా ప్రవహించి మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న ధూప్ సింగ్ తండాకు వెళ్లే దారిలో ఉన్న లో లెవల్ కాజ్ వేకి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు కొట్టుకు పోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో తండా మొత్తాన్ని నీరు ముంచేసింది. తండాలో 40 కుటుంబాలు ఉండగా ఇళ్లు, పూరి గుడిసెలు, పశువుల కొట్టాలు అన్నీ నీట మునిగి పోయాయి. ఊహించని విధంగా వచ్చిన వరదతో ఏమి చేయాలో పాలుపోక గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
తండా మొత్తం మోకాలి లోతు నీరు చేరడంతో కొందరు బిల్డింగ్ ల పైకి ఎక్కారు. మరి కొందరు వాటర్ ట్యాంక్ మీదకు ఎక్కారు. ఇంకొందరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేక నీటిలోనే ఉండిపోయారు. ఇళ్లలోకి, గుడిసెల్లోకి నీరు చేరి బియ్యం, వడ్లు, దుస్తులు, తదితర సామగ్రి అంతా తడిసి ముద్దయింది. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక, రాత్రి పూట కరెంట్ లేక అంతా చీకటి మాయమై నరకం అనుభవించామని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత్యంతరం లేక బురద నీరే తాగమని చెప్పారు. వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తండా వాసులు తెలిపారు. శనివారం పలు స్వచ్ఛంద సంస్థలు ధూప్ సింగ్ తండాకు చేరుకుని గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తండాను సందర్శించి వరదతో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.