కదిలిన ప్రాణహిత.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో పెరుగుతున్న వరద

కదిలిన ప్రాణహిత.. ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో పెరుగుతున్న వరద
  • కృష్ణా పరిధిలో జూరాల, శ్రీశైలం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
  • 537 అడుగులకు చేరుకున్న సాగర్

భద్రాచలం/కాగజ్‌‌నగర్‌‌, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో ప్రాణహితలో కదలిక మొదలైంది. మరో వైపు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతుండడంతో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తున్న వార్దా, ప్రాణహిత నదుల్లో ప్రవాహం మొదలైంది. వార్దా, వైన్‌‌ గంగ నదుల సంగమంతో అసిఫాబాద్‌‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత పరుగందుకుంది. మంగళవారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితకు స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి 24.1 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. సీతమ్మసాగర్‌‌ బ్యారేజీ బ్యాక్‌‌ వాటర్‌‌తో పర్ణశాల వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. 

కృష్ణమ్మకు పెరుగుతున్న వరద
గద్వాల/శ్రీశైలం/హాలియా, వెలుగు: కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌‌ నుంచి జూరాల ప్రాజెక్ట్‌‌కు వరద కొనసాగుతోంది. భారీ స్థాయిలో వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్ట్‌‌ వద్ద 14 గేట్లు ఓపెన్‌‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడి నుంచి గేట్ల ద్వారా 94,794 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,658, బీమా లిఫ్ట్ -1 ద్వారా 1300, కోయిల్‌‌సాగర్‌‌ లిఫ్ట్‌‌కు 315, లెఫ్ట్ కెనాల్‌‌కు 770, రైట్ కెనాల్‌‌కు 400, ఆర్డీఎస్‌‌ లింక్‌‌ కెనాల్‌‌కు 150ల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌‌కు 1,81,051 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్‌‌ క్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగుల మేల నీరు నిల్వ ఉంది.

వరద కొనసాగుతుండడంతో మూడు క్రస్ట్‌‌ గేట్లతోపాటు కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 1,74,316 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండడంతో నాగార్జునసాగర్‌‌ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు సాగర్‌‌లో 537 అడుగుల(182.1330 టీఎంసీల) నీరు చేరింది. సాగర్‌‌ నుంచి ఎడమకాల్వ హెడ్‌‌ రెగ్యులేటరీ ద్వారా 3,146  క్యూసెక్కులు, ఎస్‌‌ఎల్‌‌బీసీ (ఏఎమ్మార్పీ)కి 1,500 క్యూసెక్కులు కలిపి మొత్తం 4,646 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.