- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్/వైరా, వెలుగు : పత్తి, మక్కజొన్న సాగుకు బదులు ఆయిల్‌పామ్ సాగు చేస్తే అధిక లాభాలు పొందొచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, వైరా మండలాల్లోని ఆయిల్‌పామ్ తోటలను శుక్రవారం మంత్రి పరిశీలించారు.
రజబ్ అలీ నగర్‌లో బాణోతు వీరన్న,- విజయ రైతులకు చెందిన పొలం వద్దకు వెళ్లి, ఏ పంట వేశారు ? గతంలో ఎంత దిగుబడి వచ్చింది ? అని అడిగి తెలుసుకున్నారు. మక్కజొన్న సాగు చేస్తున్న రైతు పొలం వద్ద ఆగి పామాయిల్ సాగు చేయాలని, తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం లాభాలు ఉంటాయని వివరించారు. మొక్కలు, డ్రిప్ పరికరాలు, ఎరువులను సబ్సిడీ కింద అందిస్తామని చెప్పారు.
అకాల వర్షాలు, రాళ్లవానలు, చీడపీడలు, కోతులు, అడవి పందులతో ఆయిల్‌పామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పంట మార్కెటింగ్‌కు సైతం ఎలాంటి సమస్యలు రావన్నారు. అనంతరం కొణిజర్ల మండలం అంజనాపురంలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించారు.
ఖమ్మం జిల్లాలో ఆరు మండలాల్లో, కొత్తగూడెం జిల్లాలో నాలుగు మండలాల్లో ఆయిల్‌పామ్ సాగు ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీ పనులను జనవరిలోపు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 700 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
గోద్రెజ్ కంపెనీతో సీడ్ గార్డెనింగ్‌కు సైతం సీఎం రేవంత్‌రెడ్డి ఎంఓయూ కుదుర్చుకున్నారని, దానికి త్వరలోనే భూమిని అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి వెంట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, అగ్రికల్చర్ ఆఫీసర్ జి. పుల్లయ్య, హార్టికల్చర్ ఆఫీసర్ మధుసూదన్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ఉన్నారు.
