
లక్షలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు… పంట నష్టంపై పట్టింపు లేని సర్కారు
నేటికీ పలు జిల్లాల్లో ప్రాథమిక నివేదికలు రూపొందించని అధికారులు
తీవ్ర ఆందోళనలో అన్నదాతలు… నష్టపరిహారం చెల్లించాలని వేడుకోలు
కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి పంటలకు అధికనష్టం జరిగింది. కోతకు వచ్చిన వరి నేలవాలగా, వరుస వర్షాలకు పత్తి చేలల్లో దూది కూలబడిపోతోంది. కాయలు నల్లగా మాడిపోతున్నాయి. సర్కారు నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో వ్యవసాయాధికారులు నేటికీ పూర్తిస్థాయిలో పంటనష్టంపై ఒక అంచనాకు రాలేదు. కొన్ని జిల్లాల్లో పంటనష్టంపై ప్రాథమిక నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా, చాలా జిల్లాల్లో నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. వర్షాల కారణంగా వడ్లలో తేమ పెరగడంతో మద్దతు ధర చెల్లించి కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. మాయిశ్చర్ పేరిట మాయ చేస్తూ మద్దతు ధరలో కోత పెడుతున్నారు. క్వింటాల్ వడ్లకు రూ.1835 చెల్లించాల్సి ఉండగా, రూ.1300 నుంచి రూ.1400 వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏ జిల్లాలోనూ పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు వ్యాపారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే అన్నిచోట్లా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లాలో 6,141 ఎకరాల్లో వరి, 4,894 ఎకరాల్లో సోయా, 4264 ఎకరాల్లో పత్తి, 128 ఎకరాల్లో మక్క, 900 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు.
నిజామాబాద్ జిల్లాలో సుమారు 9166 మంది రైతులకు చెందిన 15,200 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారుల ప్రాథమిక నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. మొత్తంగా 149 గ్రామాలకు చెందిన 9166 మంది రైతులు నష్టపోయినట్లు తేల్చారు. 12,456 వరికి, 2603 ఎకరాల్లో సోయాకు, 168 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో 34,770 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. వరి 16,142 ఎకరాల్లో, మక్క 4,224 ఎకరాల్లో, సోయాబీన్ 11 వేల ఎకరాల్లో, పత్తి 3,404 ఎకరాల్లో దెబ్బతింది.
వరంగల్ అర్బన్ జిల్లాలో 6,258 రైతులకు చెందిన 8,483 ఎకరాల వరి, 253 రైతులకు చెందిన 330 ఎకరాల పత్తి పంట దెబ్బతింది. 55 మంది రైతులకు చెందిన 67 ఎకరాల్లో మక్కకు నష్టం జరిగినట్లు అధికారులు సర్కారుకు నివేదించారు. వరంగల్ రూరల్ జిల్లాలో 2164 రైతులకు చెందిన 2,443 ఎకరాల వరి, 1560 రైతులకు చెందిన 1580 పత్తి పంటకు నష్టం కలిగింది. జనగామ జిల్లాలో 2690 మంది రైతులు 1415.6 హెక్టార్లలో వివిధ పంటలు కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. భూపాలపల్లి జిల్లాలో 10వేల ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో పత్తి, ములుగు జిల్లాలో 5వేల ఎకరాల్లో వరి, వెయ్యి ఎకరాల్లో పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించి, ఉన్నతాధికారులకు నివేదించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా నది వరదల కారణంగా తీర ప్రాంతల్లో నష్టం ఎక్కువగా ఉంది. మక్తల్, మాగనూరు మండలాల్లోని 8690 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. మరో 1200 ఎకరాల్లో పత్తికి నష్టం జరిగిందని అధికారులు అంచనావేశారు. 92 ఎకరాల్లో మక్క, ఇతర పంటలు స్వల్పంగా నష్టపోయినట్లు ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో 1,250 ఎకరాల్లో మక్క దెబ్బతింది.
జగిత్యాల జిల్లాలో సుమారు 8వేల మంది రైతులకు చెందిన 43,789 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. మక్క, పసుపు, పత్తి పంటలకు 30 శాతం నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 8,394 మంది రైతులకు చెందిన10,335 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు.
ఖమ్మం జిల్లాలో ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఝాన్సీ లక్ష్మీకుమారి చెప్పారు. 33 శాతానికి మించి నష్టం జరిగితేనే అంచనాలు సేకరిస్తామన్నారు.
నల్గొండ జిల్లాలో వ్యవసాయశాఖ అంచనా మేరకు 8584 ఎకరాల్లో వరి రైతులు నష్టపోయారు. దీని విలువ సుమారు రూ.17.50 కోట్లు ఉంటుందని అధికారులు అంటున్నారు.యాదాద్రి జిల్లాలో 6 వేల ఎకరాల్లో వరి, 650 ఎకరాల్లో పత్తి పంటకు, 200 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 27వేల హెక్టార్లలో పత్తి, 450 ఎకరాల్లో వరి కి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
మెదక్ జిల్లాలో ఇటీవలి వర్షాలకు ప్రాథమికంగా 883 ఎకరాల్లో వరి, 226 ఎకరాల్లో పత్తి, 70 ఎకరాల్లో మక్క, 40 ఎకరాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 25 వేల ఎకరాల్లో పత్తి, 32 వేల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో 1 1,034 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 5832 ఎకరాల్లో, మక్క 2838 ఎకరాల్లో, పత్తి 2364 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. మొత్తం7 వేల మంది రైతులు పంట నష్టపోయినట్లు అధికారులు చెబుతున్నారు.