హైదరాబాద్​లో మళ్లీ  జోరు వాన

హైదరాబాద్​లో మళ్లీ  జోరు వాన

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు, కాలనీలు నీటమునిగాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కరెంటు తీగలు తెగిపడి కానిస్టేబుల్ వీరాస్వామి(45) చనిపోయారు. 

గచ్చిబౌలిలో గంటలో 6 సెం.మీ. వర్షం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి గంట పాటు వాన దంచికొట్టింది. సాయంత్రం నుంచి అక్కడక్కడా చిరుజల్లులు పడినప్పటికీ రాత్రి 9 గంటల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది.  గచ్చిబౌలిలో రాత్రి 9 నుంచి 10లోపు గంట వ్యవధిలో నే 6 సెంటీమీటర్ల వర్షం పడింది. గ్రేటర్ లో మరోసారి అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో రోడ్లు, కాలనీలు నీట మునిగాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ లు అయ్యాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కిస్మత్ పుర, బండ్లగూడ జాగీర్, హిమాయత్ సాగర్, తార్నాక, ఉప్పల్, నాచారం, సీతాఫల్ మండి, బేగంపేట, రసూల్ పుర ఏరియాల్లో ఉరుములతో కూడిన వాన పడింది. 

నాచారం, మేడిపల్లి, ఘట్ కేసర్ లో కరెంట్ సప్లయ్ నిలిచిపోగా, పలు కాలనీల్లో జనం ఇబ్బందిపడ్డారు. రాంనగర్, అడిక్ మెట్, విద్యానగర్, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఏరియాల్లో రోడ్లపై నీరు భారీగా చేరింది. ఎక్కడైనా వర్షపు నీటితో ఇబ్బందులు ఉంటే 040-29555500 హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలని బల్దియా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి సూచించారు. గ్రేటర్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని బల్దియా అధికారులను ఆదేశించారు. 

రాత్రి 9 నుంచి 10 మధ్యలో వర్షపాతం


ఏరియా                               (సెం.మీ.) 
గచ్చిబౌలి         6.3 
షేక్ పేట         5.2  
జూబ్లీహిల్స్         4.6 
మాదాపూర్         4.5  
శ్రీనగర్ కాలనీ     4.1  
అమీర్ పేట        4.0