వరద పోయి.. బురద మిగిలే..కామారెడ్డి జిల్లాలో భారీ నష్టం

వరద పోయి.. బురద మిగిలే..కామారెడ్డి జిల్లాలో భారీ నష్టం
  • 76,984 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 
  • పొలాల్లో ఇసుక మేటలు, నేలకొరిగిన పంటలు

 కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లాలో  వరుసగా 2 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షం, వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.  పంటలు దెబ్బతినగా, బ్రిడ్జిలు కొట్టుకుపోగా రోడ్లు దెబ్బతిన్నాయి.  చెరువుల కట్టలు తెగిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జిల్లాలో   76,984 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార వర్గాలు గుర్తించాయి.  

పంట పొలాల్లో ఇసుక మేటలు 

పంట పొలాల్లో ఇసుక మేటలు వేయటం,  కంకర, రాళ్లు చేరి నష్టం వాటిల్లింది. 249 గ్రామాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 76,984 ఎకరాల పంట దెబ్బతింది. 54,223 మంది రైతులకు  నష్టం వాటిల్లింది. అత్యధికంగా వరి పంట  44,077 ఎకరాలు, మక్క 13,097 ఎకరాలు, సోయా  9,102 ఎకరాలు,  పత్తి   9,782 ఎకరాలు, పెసర 546 ఎకరాలు, మినుము 287 ఎకరాలు, చెరకు 93 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  

తెగిన బ్రిడ్జిలు... దెబ్బతిన్న రోడ్లు

ఆర్​అండ్​బీ, పంచాయతీ రాజ్​ శాఖలకు చెందిన 60కి పైగా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  రోడ్లు , బ్రిడ్జిలు దెబ్బతినటంతో  పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలకు 3 రోజులుగా రవాణా వ్యవస్థ లేదు.  కామారెడ్డి- ఎల్లారెడ్డి రూట్లో  4 చోట్ల  బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ​లింగంపేట మండలం  లింగంపల్లి వద్ద పాముల బ్రిడ్జి కంప్లీట్​గా కొట్టుకుపోయింది.   కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ తదితర మండలాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.   

జిల్లా కేంద్రం నుంచి  రాజంపేట మండల కేంద్రం మీదుగా మెదక్​ జిల్లా వరకు ఉన్న రోడ్డు పలు చోట్ల ధ్వంసమైంది.  లింగాయపల్లి సమీపంలో  బ్రిడ్జి వద్ద రోడ్డు 100 మీటర్ల వరకు కొట్టుకుపోయింది.  బీబీపేట మండల కేంద్రం సమీపంలో  బ్రిడ్జి  ఒక వైపు కంప్లీట్​గా కొట్టుకుపోయింది. మెదక్, ఎల్లారెడ్డి మార్గంలో రాకపోకలు సాగట్లేదు.  ​ పాల్వంచ వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో   కామారెడ్డి నుంచి  కరీంనగర్​ వైపు రాకపోకలకు ఆటంకంగా మారింది.  లింగంపేట మండలం కన్నాపూర్​ సమీపంలో బ్రిడ్జి  100 మీటర్లకు పైగా సీసీ రోడ్డు కొట్టుకుపోయి ది. జుక్కల్​, గాంధారి మండలాల్లో కూడా పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. 

  ఎప్పుడు ఈ పరిస్థితి చూడలే

5 ఎకరాల   కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశా.   ఎకరాకు  రూ. 30వేల వరకు ఖర్చు అయింది. చెరువు కట్ట తెగిపోయి వరద నీరు పొలంలో నుంచి వెళ్లింది.  సగం పొలం ఇసుక మేటలు వేయగా,  మరో సగం వరి కర్రలు వంగిపోయాయి.  పంట ఏమాత్రం  రాదు. ఈ పరిస్థితి నాకు తెలిసి ఎప్పుడు చూడలే.- సత్తయ్య,  పొల్కంపేట, కామారెడ్డి జిల్లా

తెగిన చెరువులు

కామారెడ్డి జిల్లాలో  పలు మండలాల్లో చెరువులు తెగిపోయాయి.  లింగంపేట మండలంలో 4 చెరువు, కట్టలు కంప్లీట్​గా తెగిపోగా పదుల సంఖ్యలో చెరువులకు బుంగలు పడ్డాయి.  వరద తీవ్రతకు  పొల్కంపేట చౌదరి చెరువు  కట్ట కొట్టుకుపోగా ప్రస్తుతం నీరు మొత్తం పోయి మట్టి మాత్రమే కనిపిస్తోంది. లింగంపల్లి మల్లారం కట్ట తెగి పంటలకు నష్టం జరిగింది.  శెట్​పల్లి సంగారెడ్డిలో చెరువు కట్ట దెబ్బతింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలంలో 3, గాంధారి మండలంలో 1 చెరువు కట్ట దెబ్బతింది.   పలు మండలాల్లో 40 వరకు చెరువులకు బుంగలు ఏర్పడ్డాయి.  బీబీపేట పెద్ద చెరువుకు బుంగ ఏర్పడి నీరు బయటకు పోతుంది.