ద్రోణి ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వానలు

ద్రోణి ఎఫెక్ట్ తో రాష్ట్రంలో వానలు

హైదరాబాద్ సిటీలో రాత్రి భారీ వర్షం పడింది. అర్ధరాత్రి తర్వాత మొదలైన వాన తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కురిసింది. సిటీలోని ఏఎస్ రావు నగర్ లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చర్లపల్లి, బండ్లగూడలో 9 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్ లో 8 , సరూర్ నగర్ లో 7, ఎల్బీనగర్లో 6, లింగోజిగూడ లో 5, రామంతపూర్ , శివరాంపల్లి, హయత్ నగర్ లో 5 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరి, బాలానగర్లో 4 , సీతాఫల్ మండిలో 3.7 సెంటీమీటర్లు, అత్తాపూర్, మెట్టుగూడ, జియగూడలో 3 సెంటీమీటర్లు, అంబర్ పేట్  లో 2.8, సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో 2 సెంటీమీటర్ల వర్షం పడింది.  

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది.