హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు గంటలు ట్రాఫిక్​లోనే..

హైదరాబాద్ లో భారీ వర్షం.. మూడు గంటలు ట్రాఫిక్​లోనే..

వెలుగు, గచ్చిబౌలి/మూసాపేట/గండిపేట/అబిడ్స్: సోమవారం సాయంత్రం కురిసిన భారీ వానకు గ్రేటర్​లోని మెయిన్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్​ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఐటీ కారిడార్​లో వాటర్​ లాగింగ్ పాయింట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్లు ఆఫీసులు, కాలేజీల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్ కావడంతో సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఐటీ కారిడార్​లోని అన్నీ మెయిన్​ రోడ్లు వెహికల్స్​తో నిండిపోయాయి. కి.మీ దూరానికి దాదాపు గంటకుపైగా టైమ్ పట్టింది. 

బయో డైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే దారిలో, సైబర్ టవర్స్, గచ్చిబౌలి, ఐఐఐటీ, విప్రో, లింగంపల్లి, నల్లగండ్ల, ఖాజాగూడ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ నెలకొంది. హైటెక్​సిటీ, నానక్​రాంగూడలోని ఐటీ ఎంప్లాయీస్ ఇండ్లకు చేరుకునేందుకు దాదాపు 2 నుంచి 3 గంటల టైమ్ పట్టింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, కూకట్​పల్లి, సనత్​నగర్, అమీర్ పేట, మెహిదీపట్నం, అశోక్‌నగర్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, శివరాంపల్లి, ఉప్పర్​పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగి సహా సిటీ శివారు ప్రాంతాలైన ఎల్​బీనగర్, వనస్థలిపురం, విజయవాడ హైవేపై వర్షపు నీరు చేరడంతో వెహికల్ మూవ్ మెంట్ స్లోగా కొనసాగింది.