ఆసిఫాబాద్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు, ఆగిన రాకపోకలు

ఆసిఫాబాద్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు, ఆగిన రాకపోకలు
  • ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం 

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం వానలు దంచికొట్టాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బెజ్జూర్ మండల కేంద్రంలో వాగు పక్కనే ఉన్న డంప్ యార్డులో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చిక్కుకోగా సీఐ ముత్యం రమేశ్, తహసీల్దార్ రామ్మోహన్ సిబ్బంది, స్థానికులతో కలిసి తాళ్లు కట్టి బయటకు తీసుకొచ్చారు. సుస్మీర్, సోమిని, కుష్నపల్లి వాగులు ఉప్పొంగడం తో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానేపల్లి మండలం దిందా వాగు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహించగా రాకపోకలు బంద్ అయ్యాయి. 

గూడెం, శివపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కుకుడా సమీపంలో పోతేపల్లి వాగు ఉప్పొంగి ఇండ్ల సమీపంలోకి నీళ్లు వచ్చాయి. నాయికపుగూడ వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచాయి. కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ లోపల, డిప్యూటీ తహసీల్దార్ ఛాంబర్ లో రెండు ఇంచుల మేర నీళ్లు నిలిచాయి. ఆసిఫాబాద్ మండలం గుండి పెద్ద వాగు, కెరమెరి మండలం లక్మాపూర్, అనార్ పల్లి పెద్ద వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లా ప్రజలు అలర్ట్ గాఉండాలి: ఎస్పీ 

జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారులపై నుంచి దాటవద్దని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలను చూసేందుకు వెళ్లవద్దని అన్నారు.

 శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, డయల్ 100 లేదా 8712670551 నంబర్​ను సంప్రదించాలని సూచించారు.