
- నేల రాలిన మామిడి కాయలు
- ఎగిరిపోయిన ఇంటి పై కప్పులు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: అకాల వాన.. వడగళ్లతో బుధవారం మంచిర్యాల జిల్లా ఆగమాగం అయింది. నెన్నెల మండలం గుండ్ల సోమారం, చిత్తాపూర్, ఆవుడం, జెండా వెంకటాపూర్, మైలారం, గొల్లపల్లి, కొత్తూర్, గంగారాం గ్రామాల్లో సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. వడ్ల కుప్పలు తడిసిపోగా కోతకు వచ్చిన పొలాలు నేలకొరిగాయి. తోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. గుండ్ల సోమారంలో రెండు విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అకాల వాన, వడగళ్లతో జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని బాధితులు కోరారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలం రంగపేటలో గాలివాన బీభత్సానికి ఇంటిపై కప్పు పూర్తిగా ఎగిరిపోయింది. ఇటీవలే కొత్తగా ఇంటిని నిర్మించుకున్నానని, తాను తీవ్రంగా నష్టపోయానని బాధితుడు కామెర ప్రభాకర్ వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
భీమారం, జైపూర్ మండలాల్లో..
జైపూర్(భీమారం) : భీమారం మండలంలో సాయంత్రం అరగంట రాళ్లవాన పడింది. పలు గ్రామాల్లో పంట పొలాలు నెలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిపోయాయి. గాలి దుమారానికి టార్ఫాలిన్లు ఎగిరి పోవడంతో సుమారు రూ. 10 లక్షలపైగా నష్టం జరుగుతుందని రైతు శ్రీనివాస్ వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. జైపూర్ మండలం పౌనూర్ లో గాలి దుమారానికి పలువురి ఇండ్ల పైకప్పులు కప్పులు ఎగిరిపోయాయి.
భద్రాద్రి జిల్లాలోని
కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, బూర్గంపాడు, టేకులపల్లి, ఇల్లెందు, ఖమ్మం జిల్లా కల్లూరు, తల్లాడ టౌన్లలోని పలు ప్రాంతాల్లో రాత్రి గాలి దుమారంతో భారీవాన పడింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో కరెంటు సప్లై నిలిచిపోగా అంధకారం నెలకొంది. మణుగూరులో వడగండ్ల
వాన పడింది.
ఎల్కతుర్తిలో..
ఎల్కతుర్తి : హనుమకొండ జిల్లాలో మోస్తరు వాన పడింది. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధాన్యాన్ని కుప్ప చేసి, టార్పాలిన్లు కప్పుకునేందుకు, తడిసిన ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు శ్రమించారు. హసన్ పర్తి మండలంలోనూ వర్షం కురిసింది.