
- మేడారం జంట వంతెనలను తాకుతూ ప్రవహిస్తోన్న జంపన్నవాగు
- మేడిగడ్డ బ్యారేజీకి 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉధృతితో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. చాలా చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి. మేడారంలో జంట వంతెనలను తాకుతూ జంపన్నవాగు ప్రవహిస్తోంది. గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి శనివారం ఉదయం 3.10 లక్షల క్యుసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మధ్యాహ్నం 3 గంటల వరకు 3.72 లక్షలకు పెరిగింది. గోదావరి ఎగువ భాగంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. రెవెన్యూ, ఐబీ, ఇతర శాఖ ఆఫీసర్లను అందుబాటులో ఉండమని ఆదేశాలు జారీ చేసింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో అత్యధికంగా 21 సెం.మీ వర్షం కురవగా, మంగపేటలో 13, వెంకటాపురంలో 11, ములగులో 10, వెంకటాపూర్‌లో 10, భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో 10 సెం.మీ వర్షం పడింది.
పొంగిపొర్లుతున్న వాగులు
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు మేడారంలో జంట వంతెనలను తాకుతూ జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లక్నవరం చెరువు నిండింది. భూపాలపల్లి జిల్లాలోని కాటారం–మేడారం ప్రధాన రహదారిపై ఉన్న పెద్దవాగు ఉప్పొంగడంతో, మహాముత్తారం–యామన్ పల్లి మధ్య ఉన్న కోణంపేట అలుగువాగు పారడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లాలోని బండారుపల్లి శివారులో రాళ్లవాగు పొంగి వరద రోడ్డుపై ప్రవహిస్తోంది. భూపాలపల్లి వైపు ప్రయాణం చేసే వాళ్లు జంగాలపల్లి మీదుగా రూట్ డైవర్ట్ చేశారు.
వెంకటాపూర్ మండలంలోని నేషనల్ హైవే రోడ్డు నుంచి లింగాపూర్ వెళ్లే మార్గంలో రహదారిలో సుద్ధవాగు పొంగడంతో వెంకటాపూర్ మీదుగా రూట్ డైవర్ట్ చేశారు. పస్రా నుంచి మేడారం వెళ్లే మార్గంలో ప్రాజెక్ట్ నగర్ దాటిన తర్వాత బాంబులమోరి, యాసంగి తోగు వద్ద రోడ్డుపై వరద ప్రవహిస్తుండడంతో మేడారం వెళ్లే వారు పస్రా- తాడ్వాయి గుండా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తాడ్వాయి మండలం చింతల్ నుంచి ఎల్బాక మధ్యలో వాగు పొంగి బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తోంది.
ఎల్బాక, పడిగపూర్ వెళ్లేవారు మేడారం - కొంగలమడుగు మార్గం ద్వారా వెళ్లాలని, ఊరట్టం సమీపంలో తుమ్మవాగు పొంగి బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తున్నందున రాకపోకలు తాత్కాలికంగా నిషేధించామని ములుగు డీఎస్పీ రవీందర్ ప్రకటించారు. కాగా, చెరువుల మత్తళ్ల దగ్గర మత్స్యకారులు కట్టే వలలను తొలగించాలని మత్స్యశాఖ ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు.
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హై అలర్ట్..
అతి భారీ వర్షాల నేపథ్యంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లను అప్రమత్తం చేశారు. అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఏఈలకు వారి పరిధిలోని చెరువులు, కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. అవసరమున్నచోట రహదారులు మూసివేయాలని, భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన..
నర్సంపేట/ నల్లబెల్లి/ గూడూరు/ భూపాలపల్లి రూరల్, వెలుగు: భారీ వర్షాల దృష్ట్యా ఆయా జిల్లాల కలెకర్లు శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లోలెవల్కాజ్వేను వరంగల్ కలెక్టర్ పరిశీలించి, పాకాల చెరువు మత్తడి పెరిగే అవకాశం ఉన్నందున కొత్తగూడ, అశోక్‌నగర్ రూట్లో రాకపోకలను నిలిపివేశారని, కాజ్‌వేపై నుంచి ఎవరినీ అనుమతించవద్దని పోలీసులకు సూచించారు. నల్లబెల్లి మండలం లెంకాలపెల్లి కాజ్ వే, నర్సంపేట - చెన్నారావుపేట రూట్లోని ముగ్ధుంపురం కాజ్వే, నర్సంపేట సమీపంలోని మాధన్నపేట కాజ్‌వేలను పరిశీలించి, అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులో పాకాల చెరువు మత్తడి వద్ద నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు ఉధృతి పెరగడంతో నెక్కొండ, కేసముద్రం మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్‌టొప్పో ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. భీమునిపాదం జలపాతం వద్ద వరద ఉధృతంగా ఉండడంతో పర్యాటకులను అనుమతించడం లేదు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మోరంచవాగు ఉధృతిని కలెక్టర్ రాహుల్‌శర్మ పరిశీలించారు. జిల్లాకు రెడ్ అలెర్ట్ ఉండడంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.