హైదరాబాద్ సిటీలోభారీ వర్షం.. ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రావొద్దు

హైదరాబాద్ సిటీలోభారీ వర్షం.. ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రావొద్దు

హైదరాబాద్ లో అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది. నగరం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, శ్రీనగర్ కాలనీ, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. 

Also Read :- తెలంగాణలో మళ్లీ వానలే వానలు.. సెస్టెంబర్ 14, 15 తేదీల్లో భారీ వర్షాలు

దీంతో పాటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కుత్బుల్లాపూర్, సూరారం, బహదూర్ పల్లి, చింతల్, గాజులరామారం, బషీర్ బాగ్, నారాయణగూడ, అబిడ్స్, కోఠి, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇక పంజాగుట్ట, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయింది. దీంతో రానున్న రెండు మూడు గంటల్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రావొద్దు :

హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం పడుతుండటంతో.. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతుంది. దీనికితోడు ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కావటంతో మరింత ట్రాఫిక్ జాం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ఆఫీసుల నుంచి ఒకేసారి బయటకు రావొద్దని.. నిదానంగా.. టైం తీసుకుని రోడ్డెక్కాలని సూచిస్తున్నారు. 

మరోవైపు ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడతాయని అంచనా వేసింది. 

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మిగిలిన జిల్లాలలో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది.