
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోయాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. బ్రిడ్జిల మీద నుంచి నీరు ప్రవహిస్తు్ండడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. హైదరాబాద్ నగరంలో కూడా కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఈ క్రమంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు జీహెచ్ఎంసీ (GHMC)లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్ 040-21111111 ను సంప్రదించాలన్నారు. కంట్రోల్ రూం 24 గంటల పాటు పని చేస్తుందని తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు...
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయి అధికారులు పరిస్థితులను పరిశీలించి ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, మూసీ నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని వసతులు కల్పించాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మాన్సూన్ ఏమర్జెన్సీ టీమ్ లు డీఆర్ఎఫ్ (DRF)లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత...
మరోవైపు... గండిపేట రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో 8 గేట్లను 6 ఫీట్ల మేర ఎత్తి 4,658 క్యూసెక్కులు నీటిని మూసిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు 4,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో నీరు ఉండటంతో 6 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 3,910 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.