హైదరాబాద్‌లో కుండపోత వాన.. మలక్‌పేట్‌ టూ దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు జామ్

హైదరాబాద్‌లో కుండపోత వాన.. మలక్‌పేట్‌ టూ దిల్‌సుఖ్‌నగర్ రోడ్డు జామ్

హైదరాబాద్‌ సిటీని వాన వీడనంటోంది. గడిచిన రెండ్రోజుల నుంచి వర్షం దంచికొడుతోంది. ఈ రోజు మధ్యాహ్నం మొదలైన కుండపోత రాత్రికి కూడా ఆగలేదు. దీంతో సిటీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎటు చూసినా వరద నీటి ప్రవాహమే కనిపిస్తోంది. దీంతో సిటీ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కుండపోత వర్షంతో మలక్ పేట్‌, చాదర్ ఘాట్, సైదాబాద్ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. -మలక్ పేట్‌ నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి  వరద ఉధృతితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచి పోయింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు. 

ఒక వైపు వర్షం, మరో వైపు జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటిని వదలడంతో మూసారాంబాగ్ – చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జ్ మునిగిపోయింది. మరోవైపు మలక్ పేట మహబూబ్ మాన్షన్ మార్కెట్లో వర్షపు నీరు నిలవడంతో రైతులు, వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. మలక్ పేట రైల్వే బ్రిడ్జి, అజాంపురా బ్రిడ్జి కింద నీటి ఉధృతితో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.