హైదరాబాద్​లో అర్థరాత్రి నుంచి దంచికొట్టిన వాన

హైదరాబాద్​లో అర్థరాత్రి నుంచి దంచికొట్టిన వాన
  • సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాకా దంచికొట్టిన వాన
  •     మెహిదీపట్నంలో 11.2 సెం.మీ.
  •     ఇండ్లలోకి వరద.. కొట్టుకుపోయిన సరుకులు
  •     జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి నీళ్లు
  •     రోడ్లు జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్
  •     కాంట్రాక్టర్ల సమ్మెతో పత్తాలేని సహాయ బృందాలు
  •     మరో రెండ్రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లో వాన ఉన్నట్టుండి దంచికొట్టింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఎండ ఉన్నా.. ఆ తర్వాత వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. ఉరుములతో మొదలై అర్ధరాత్రిదాకా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఇండ్లు, షాపుల్లోకి వరద చేరింది. కొన్ని చోట్ల సరుకులు కొట్టుకుపోయాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి వరద నీళ్లు వచ్చాయి. హైదరాబాద్ కలెక్టరేట్‌‌లోని ఓ ఫ్లోర్‌‌ ఉరుస్తుండటంతో నీళ్లు చేరాయి. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సహాయక బృందాలు కనిపించలేదు. సడెన్‌‌గా వర్షం పడటంతో ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు రావడానికి సమయం పట్టింది. బేగంపేట్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోఠి, లక్డీకాపూల్, మెహిదీపట్నం, నాంపల్లి, మలక్ పేట్, దిల్ సుఖ్‌‌నగర్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌‌కి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటర్ లాగింగ్, చెట్ల కొమ్మలు, విద్యుత్, డ్రైనేజీలు తదితర సమస్యలు ఉన్నాయంటూ సిటిజన్స్ నుంచి రెండు గంటల్లోనే 150 కిపైగా కంప్లైంట్లు వచ్చాయి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశించారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లు సమ్మె చేస్తుండటంతో ఆ ప్రభావం జనంపై పడింది. పనులు ఎక్కడివి అక్కడే నిలిపివేయడంవల్ల కాలనీలు, రోడ్లపై వర్షానికి నీళ్లు నిలిచిపోయాయి. వానల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనే మాన్సున్ టీమ్స్‌‌ని కూడా కాంట్రాక్టర్లు మెయింటెన్ చేస్తుండటంతో.. సమ్మెలో భాగంగా వాటి పనులను ఆపేశారు. దీంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.