హైదరాబాద్ లో అరగంట వానకు ఆగమాగం

హైదరాబాద్ లో  అరగంట వానకు ఆగమాగం

సిటీలో కుండపోత పోసింది. అరగంట పాటు వాన దంచికొట్టింది. దీంతో గ్రేటర్ ఆగమాగం అయింది. గురువారం ఉదయం నుంచి మబ్బులు కమ్ముకుని ఉండి సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు భారీ వర్షం పడింది. దీంతో మెయిన్ రోడ్లు, కాలనీలను వరదనీరు ముంచెత్తి చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అధికంగా జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ వద్ద 4.7 సెం.మీల వర్షపాతం నమోదైంది.

ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికెళ్లే టైమ్​ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వానతో రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్​లు అయ్యాయి. ఎల్​బీనగర్ , హైటెక్ సిటీ, మాదాపూర్, రాజ్ భవన్ రోడ్డు తదితర పాంత్రాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. రోడ్లపై నీరు తొందరగా క్లియర్ కాకపోవడంతో మలక్ పేట్, మియాపూర్, లక్డీకపూల్, నాంపల్లి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో జనానికి ఇబ్బంది తప్పలేదు. మరో రెండ్రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. 

– వెలుగు,  హైదరాబాద్