హైదరాబాద్​లో నీట మునిగిన పలు కాలనీలు

హైదరాబాద్​లో నీట మునిగిన పలు కాలనీలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో వరుసగా రెండోరోజూ వర్షం దంచికొట్టింది. సోమవారం పడ్డ వాననీళ్లు క్లియర్ కాక ముందే మరోసారి భారీ వర్షం పడటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అత్యధికంగా సరూర్ నగర్ లో 5.9, హయత్ నగర్ లో 5.4, నాగోల్ లో 4.3, ఉప్పల్​లో4.0, నాంపల్లిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ లోని పలు ఇండ్లలోకి వర్షపునీరు చేరింది. డ్రైనేజీలు జామ్ అయి మురుగునీరు ఇండ్లలోకి చేరుతుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. యాకుత్ పురాలో ఇండ్లలోకి వాననీళ్లు చేరి జనం ఇబ్బంది పడ్డారు. 

వరుస వానలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయకపోవడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. హైదర్ గూడ నుంచి బషీర్ బాగ్ వెళ్లే రహదారిపై పూర్తిగా నీరు చేరడంతో కొద్దిసేపు ట్రాఫిక్​పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట్, పంజాగుట్ట, కోఠి, లిబర్టీ, హిమయత్ నగర్, రేతిబౌలి, చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ మూవ్ మెంట్ స్లోగా సాగింది.

సాయంత్రం ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటిని క్లియర్ చేయడంలో జీహెచ్ ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముంపు కాలనీల వాసులు విమర్శిస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు సమ్మెలో ఉండటంతో మాన్సున్ టీమ్స్ కూడా ఫీల్డ్ లేవు. దీంతో కాలనీలు, రోడ్లపై నిలిచిన నీళ్లు క్లియర్ అయ్యేందుకు చాలా టైం పట్టింది. సహాయక చర్యలపై కాంట్రాక్టర్ల సమ్మె ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.