
నల్గొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై, ప్రాజెక్టు పరిస్థితి, ప్రజల ఇబ్బందులపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టం తప్పిందన్నారు. గోడకూలి ఇద్దరు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వం తరుపున నష్టపరిహారం అందిస్తామని ఆయన హామీనిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లీచింగ్, క్లోరినేషన్ తో అంటు వ్యాధులకు అడ్డుకట్టు వేసేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు చేయిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.