జలదిగ్బంధంలో పలు గ్రామాలు

జలదిగ్బంధంలో పలు గ్రామాలు

ఒడిశాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖోర్దా జిల్లా అంధుతి గ్రామం జలదిగ్బంధంలోకి వెళ్లింది. వరదల్లో అనేక మంది గ్రామస్థులు చిక్కుకున్నారు. దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది. ఒడిశాలోని పది జిల్లాల్లోని ప్రజలు వర్షాల వల్ల ప్రభావితులైయ్యారు. 4 లక్షల మందికి పైగా వరద ప్రభావంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకు 60 వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఇక భారీ వర్షాలతో కటక్ లోని మందలి బ్యారేజ్ కు భారీగా నీరు చేరింది. బ్యారేజ్ దగ్గరకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హీరాకుడ్ డ్యాంకు ఎగువ నుంచి వరద పెరిగింది. ప్రమాదక స్థాయికి మించి డ్యాంలో నీరు ప్రవహించడంతో.. ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు.

మరోవైపు ఉత్తరాఖండ్ లో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. గంగోత్రి-యమునోత్రి రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. ఇటు బస్వాడ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేశారు. వర్షాలు కురుస్తుండటంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.