భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల మయం..

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల మయం..

అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం నమోదైంది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్

మరోవైపు ఆదిలాబాద్, కోమరంభీం‌, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్.. జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని  వాతావరణ శాఖ తెలిపింది.

వాహనదారుల తీవ్ర ఇబ్బందులు..

ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు వర్షపాతం నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలం నాలుగు నెలల్లో 72.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలన్నారు. అయితే జూలై 11 నాటికే 39.57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. 94 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షం నీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్ని చెరువులను తలపిస్తుండటంతో రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొమురంభీం జిల్లా కెరమెరిలో అత్యధికంగా 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జైనూర్ లో 15.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. 

లోతట్టు ప్రాంతాలు జల మయం..

మీర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడ ట్రంక్ లైన్, రైన్బాక్స్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో కాలనీల్లో వరద పోటెత్తుతోంది. మున్సిపల్ సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరో వైపు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు, పైకప్పులు ఊడి పడుతున్నాయి. రహదారులపై కరెంట్ తీగలు, చెట్లు ఎక్కడికక్కడ విరిగి పడుతున్నాయి. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలు..

జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో చాలా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలు రెండు రోజుల నుంచి జల దిగ్బంధం అయ్యాయి. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాపై సీఎం కేసీఆర్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వర్షాలతో విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు.

పొంగుతున్న వాగులు వంకలు..

భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి వరద నీరు చేరింది. రహదారులన్ని బురదమయం అయ్యాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఓసీలోకి చేరిన వరద నీటిని సింగరేణి సిబ్బంది విద్యుత్ మోటర్ల సహాయంతో తోడుతున్నారు.