
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
కామారెడ్డి, వెలుగు : జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. కామారెడ్డి, రాజంపేట, లింగంపేట, సదాశివనగర్, మాచారెడ్డి, పిట్లం, బాన్సువాడ, గాంధారి, బీర్కుర్, నస్రుల్లాబాద్ మండలాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి, లింగంపేట మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. వడ్ల కొనుగోలు సెంటర్లలో వడ్ల కుప్పల మధ్య నీళ్లు నిలిచాయి. కామారెడ్డి మండలం లింగాపూర్, చిన్నమల్లారెడ్డి, క్యాసంపల్లి, టెకిర్యాల్ అడ్లూర్, కామారెడ్డి మార్కెట్ యార్డులోని సెంటర్లలో వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. వరద నీటిలో కొన్ని వడ్లు కొట్టుకుపోయాయి.
రాజంపేట మండలం తలమడ్ల, లింగంపేట మండలం నల్లమడుగులో వడ్లు తడిశాయి. నీళ్లలో నుంచి తడిసిన వడ్లను తీసి ఆరబోసేందుకు రైతులు నానా తిప్పలు పడ్డారు. లింగంపేట మండలంలో కామారెడ్డి– ఎల్లారెడ్డి స్టేట్ రోడ్డుపై చెట్లు కూలాయి. చిన్నమల్లారెడ్డి శివారులో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. లింగాపూర్‌లో రేకుల షెడ్లు పడిపోయాయి. సెంటర్లకు తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కాంటా వేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్లలో సరిపడా టార్ఫాలిన్లు లేవని, మా గోడు ఎవరికి చెప్పుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురువడంతో గంట పాటు కరెంట్సరపరాకు అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు వైర్లపై విరిగిపడడంతో అధికారులు, సిబ్బంది తొలగించారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది
కలిగింది.
పంట నష్ట పరిహారం చెల్లించాలి
కామారెడ్డిటౌన్, వెలుగు : అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, అడ్లూర్, రాజంపేట మండలం తలమడ్ల సెంటర్లలో తడిసిన వడ్ల కుప్పలు, సంచులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. పంట నష్టం వివరాల నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని అధికారులకు సూచించారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యానికి కాంటాపెట్టేలా చూడాలని అధికారులను కోరారు.