ఎడ తెరిపి లేని వానలతో కూలుతున్న పాత ఇండ్లు

ఎడ తెరిపి లేని వానలతో కూలుతున్న పాత ఇండ్లు

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు ఊళ్లలో పాత ఇండ్లు కూలిపోతున్నాయి. నాలుగైదు రోజులుగా ముసురు పట్టడం,  మధ్యలో ఒక్కరోజు కూడా ఎండ తగలకపోవడంతో మట్టి ఇండ్లు నాని నేలమట్టమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఇండ్లు కూలిపోవడంతో ఆయా కుటుంబాలు నిలువ నీడలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. మట్టి ఇండ్లు, గోడలు కూలి ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఇద్దరు,  వరంగల్​ జిల్లాలో ఒకరు చనిపోయారు. మరో రెండు రోజులు వర్షాలు ఉండడంతో పెద్దసంఖ్యలో పాత ఇండ్లు కూలే ప్రమాదం ఉన్నందున వాటిలో ఉండవద్దని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇండ్లు కూలి నిరాశ్రయులైన పేదలకు సర్కారు తక్షణ సాయం కూడా అందివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సర్కారు బడుల్లో షెల్టర్​..
నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వందలాది పాత ఇండ్లు కూలిపోతున్నాయి. అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 595 ఇండ్లు, ములుగు జిల్లాలో 86 ఇండ్లు పడిపోయాయి. ఇందులో 44 ఇండ్లు  పూర్తిగా నేలమట్టమయ్యాయని ఆఫీసర్లు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లాలో 272 ఇండ్లు, నిజామాబాద్​ జిల్లాలో 232 ఇండ్లు, కామారెడ్డి జిల్లాలో 133 ఇండ్లు, కరీంనగర్​ జిల్లాలో  91 ఇండ్లు, మెదక్​ జిల్లాలో 84 ఇండ్లు, నిర్మల్​ జిల్లాలో 72 ఇండ్లు,  ఆసిఫాబాద్​ జిల్లాలో 65 ఇండ్లు, నాగర్​కర్నూల్​ జిల్లాలో 53 ఇండ్లు, జగిత్యాల జిల్లాలో 51 ఇండ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 ఇండ్లు కూలిపోయాయి. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 40కి తక్కువ కాకుండా ఇండ్లు  దెబ్బతిన్నాయి. ఆయాచోట్ల నాలుగో వంతు ఇండ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. పాక్షికంగా కూలిన ఇండ్లలోనూ ఉండే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. చాలా చోట్ల అధికారులు, అక్కడి సర్పంచులు, కార్పొరేటర్లు బాధితులకు వారానికి సరిపడా బియ్యం, ఇతర సరుకులు అందజేసి సర్కారుబడుల్లో తాత్కాలిక షెల్టర్​ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతానికి స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో తరగతి గదుల్లో ఉంటున్న బాధితులు, ఆ తర్వాత ఎటుపోవాలో, ఎక్కడ ఉండాలో తెలియక ఆందోళనచెందుతున్నారు. 

తక్షణ సాయం ఏదీ?
జీఓ నంబర్ 2 ప్రకారం 15 శాతం కన్నా ఎక్కువ డ్యామేజీ జరిగిన కచ్చా ఇండ్లకు రూ.3,200, పక్కా ఇండ్లకు రూ.5,200 తక్షణ సాయంగా ఇవ్వాలి. తహసీల్దార్​ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి, కలెక్టర్​ వద్ద ఉండే ఎమర్జెన్సీ ఫండ్​​ నుంచి బాధిత కుటుంబాలకు అందజేయాలి. అలాగే బియ్యం, ఉప్పు, పప్పు తదితర నిత్యావసర సరుకులు అందించాలి. 2014లో తెలంగాణ రాకముందు నిర్ణయించిన ఈ పరిహారాన్ని స్వరాష్ట్రంలో మన సర్కారు ఇప్పటికీ పెంచలేదు. ఇల్లు కూలి ఎవరైనా చనిపోతే గతంలో ఆపద్బంధు కింద కుటుంబసభ్యులకు రూ.50వేలు తక్షణ సాయం అందజేసేవారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనైతే ఇందిరమ్మ హౌసింగ్​ స్కీం కింద పక్కా ఇల్లు కూడా మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు తక్షణ సాయం బంద్​ పెట్టారు. తహసీల్దార్లు నష్టాన్ని అంచనా వేసి ట్రెజరీకి బిల్లు పంపితే   బాధితుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమవుతాయని  చెప్తున్నారు. ఇలా తక్షణ సాయం అందకపోవడంతో కనీసం నిత్యావసరాలు కూడా కొనలేకపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఇటీవల వానలకు కరీంనగర్ సిటీలోని బోయవాడ  48వ డివిజన్  కు చెందిన   కందుకూరి హనుమయ్య చారి, భాగ్యలక్ష్మికి చెందిన ఇల్లు కూలిపోయింది. ఈ ఇంట్లో వీళ్లద్దరితో పాటు  మతిస్థిమితం లేని కొడుకు ఉంటున్నాడు.  రాత్రి  ముగ్గురు నిద్రపోతున్న టైమ్ లో కొద్ది కొద్దిగా కూలడంతో వెంటనే బయటకు వచ్చారు. వీరు వచ్చిన కొద్దిసేపట్లోనే  ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది.  అప్రమత్తంగా లేకుంటే ముగ్గురూ ప్రాణాలు కోల్పోయేవారు. ఉన్న ఇల్లు కూలిపోవడంతో వీరికి నిలువనీడ లేకుండా పోయింది.  కార్పొరేషన్​ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు వచ్చి చూసివెళ్లారే తప్ప తక్షణ సాయం కింద పైసా ఇవ్వలేదు. దీంతో అదే వాడలో తెలిసిన వాళ్లను బతిమిలాడి వాళ్లింట్లో ఒక రూమ్ లో  తలదాచుకుంటున్నారు.  అన్ని సామాన్లు ఒకే గదిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.



బతికించిన ‘సావు’..
నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్‌‌ మండలం ఎన్మన్​బెట్ల గ్రామానికి చెందిన పుట్ట ఎల్లయ్య ఇంట్లో మొత్తం ఆరుగురు ఉంటున్నారు.  మంగళవారం అదే గ్రామంలో దగ్గరి బంధువు చనిపోతే ఇంటిల్లిపాది వెళ్లారు. కుటుంబమంతా మృతుడి ఇంట్లో ఉన్న సమయంలో ఎల్లయ్య ఇల్లు ఒక్క పెట్టున కూలింది. దీంతో ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇల్లు కూలడంతో బియ్యం, నిత్యావసర సరుకులు, బట్టలు, టీవీ, ఇతర వస్తువులు మట్టి దిబ్బ కింద కూరుకుపోయాయి. చావుకు వెళ్లడంతో ఎల్లయ్య కుటుంబం ప్రాణాలో బయటపడిందని గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. 

ఏం జేయాలో తెలుస్తలే
మాది పేద కుటుంబం. నా భర్త చనిపోవడంతో కూలి చేసుకుంటూ బిడ్డను పోషించుకుంటున్నా . ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు మంగళవారం మా మట్టి ఇల్లు కూలిపోయింది. కొంచెంలో ఇల్లు కూలుతదనంగా నేను, నా బిడ్డ బయటికి ఉరికి ప్రాణాలు కాపాడుకున్నం. కానీ మా సామానంతా మట్టి గోడల కిందే ఉండిపోయింది. ఏంజేయాలో తెలుస్తలేదు. ఆఫీసర్లు కూడా సాయం చేయలేదు. కౌన్సిలర్ ఫౌజియా వచ్చి స్కూల్ కు తీసుకెళ్లి అక్కడే ఉండుమన్నారు. బడి మొదలైతే ఎటుపోవాలో ఏమో - జువ్వి శారద, సుభాష్​నగర్​, ఖానాపూర్​, నిర్మల్​జిల్లా