మనకు వర్షాలు లేవు కానీ.. అక్కడ మాత్రం బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి

మనకు వర్షాలు లేవు కానీ.. అక్కడ మాత్రం బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి

ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. సోమవారం కురిసిన వర్షాలకు అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఎడతెగని వర్షాలకు బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉప్పొంగి పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. వరద ఉధృతితో అనేక గ్రామాలు నీట మునిగాయి, వరద ప్రవాహంలో రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. 

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అసోంలో వరద పరిస్థితి భయంకరంగా మారింది. తాజాగా అసోంలో భారీ వర్షాలకు కలనాడి నది పొంగి పొర్లడంతో తముల్ పూర్ వద్ద  వరద ప్రవాహంలో బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 55 వేల మంది నిరాశ్రయిలయ్యారు. దేమాజీ, సోనిత్ పూర్, లఖింపూర్, దిబ్రూగడ్ జిల్లాల్లో వేల సంఖ్యలో ప్రజలు వరద నీటిల్లో చిక్కుకుపోయారు. జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దుబ్రిలో బ్రహ్మపుత్రా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఆయా జిల్లాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. వేలల్లో నిరాశ్రయులయ్యారు.

గడచిన 24 గంటల్లో అసోం లోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లు, సాగునీటి కాల్వలు వరదలకు దెబ్బతిన్నాయి.  వరదలతో గ్రామాలు నీట మునగడంతో అంగన్‌వాడీ కేంద్రాలు, సాగునీటి కాలువలు వరదలకు దెబ్బతిన్నాయి.
అసో,  అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలోని కొండలలో అనేక చోట్ల భారీ వర్షాలు కొనసాగుతున్నందున పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ధేమాజీ, దిబ్రూగఢ్, సోనిత్‌పూర్ జిల్లాల్లో 19 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు అధికారులు. అసోంలో విపత్తు కారణంగా ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.