నేడు అతి భారీ వర్షాలు

నేడు అతి భారీ వర్షాలు
  • బుధవారం సాయంత్రం 4 నుంచి రాత్రి వరకు ఎడతెగని వర్షం
  • పలు ప్రాంతాల్లో 6 నుంచి 9 సెం.మీ. వర్షపాతం
  • వాన నీటిలో కొట్టుకుపోయిన బైక్ లు
  • మూసారంబాగ్ బ్రిడ్జిపైకి నీరు.. రాకపోకలు బంద్
  • మరో మూడు రోజులు వాన.. ఎల్లో అలర్ట్​ జారీ

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​ సిటీలో బుధవారం కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటలకు మొదలైన వాన రాత్రి వరకు దంచికొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. అల్వాల్, సరూర్ నగర్, చార్మినార్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో 6 నుంచి 9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్ లో కొన్ని కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షం కారణంగా సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం చాలాసేపు నిలిచిపోయింది.  ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో జనం నానా తిప్పలు పడ్డారు. 

సాయంత్రం స్కూల్స్, కాలేజ్ లు, ఆఫీసుల నుంచి వెళ్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గంటల తరబడి జనం వానలోని ఉండిపోవాల్సి వచ్చింది. ఎల్బీనగర్, ఖైరతాబాద్, ప్యారడైస్, సికింద్రాబాద్, కోఠి, అఫ్జల్ గంజ్, చార్మినార్, పంజాగుట్ట, బహదూర్ పురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద చెత్త పేరుకుపోయి వర్షపునీరు బ్రిడ్జిపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టువిలర్లు మధ్యలోనే ఆగిపోవడంతో వాహనదారులు తోసుకుంటూ బ్రిడ్జి దాటారు. బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పలేదు. డీఆర్ఎఫ్ బృందాలు నీటిని క్లియర్  చేసేంత వరకు రాకపోకలు బంద్ చేశారు. అదేవిధంగా అల్వాల్ లోని ఓల్డ్ అల్వాల్, సూర్యానగర్, తుర్కపల్లి, మచ్చ బొల్లారం కాలనీల్లోకి ఎన్నడూ లేని విధంగా నీరు చేరింది. కొన్ని కాలనీల్లో వాన నీటిలో బైక్​లు కొట్టుకుపోయాయి. రెండ్రోజులుగా సిటీలో వానలు పడుతుండగా.. మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

నేడు అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో  గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  మొత్తం 14 జిల్లాలకు హెచ్చరికలు చేస్తూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్(అర్బన్),  వరంగల్(రూరల్), జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నెల 11 తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురువనున్నట్టు ప్రకటించింది. బుధవారం నారాయణపేట జిల్లా మద్దూరులో 9 సెం.మీ., జనగామ జిల్లా కొడకండ్లలో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.