ఆగని వాన..ఊళ్లను చుట్టుముట్టిన వరద

ఆగని వాన..ఊళ్లను చుట్టుముట్టిన వరద

వెలుగు, నెట్​వర్క్​ : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకల్లో వరద పోటెత్తుతోంది. ఉత్తర తెలంగాణ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మం జిల్లాల్లో రోడ్లు, చెరువులు తెగి వందలాది  గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణాల్లోంచి వరద పోయే మార్గం లేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాలనీల్లో జనం ఇండ్లలోకి చేరిన నీళ్లను ఎత్తిపోస్తూ కనిపించారు. 

జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాటారంలో ఆదివారం అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహాముత్తారంలో 28, మహాదేవ్‌‌పూర్‌‌లో 24 సెంటీమీటర్లు పడింది. వరంగల్ నుంచి కాళేశ్వరానికి వచ్చిన ప్రైవేట్‌‌ బస్సు కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ మట్టిలో దిగబడింది. రాత్రంతా ప్రయాణికులు బస్సులోనే ఉన్నారు. ఆదివారం ఉదయం పోలీసుల బుల్​డోజర్‌‌తో బయటికి తీసుకవచ్చారు. మహాదేవ్​పూర్​‒ కాళేశ్వరం రహదారిలో  అన్నారం మూలమలుపు దాటాక చెట్టు కూలిపోయి ట్రాఫిక్ జామయ్యింది. కాటారం మండలంలోని వీరాపూర్ శివశంకర్ చెరువు, గూడూరులోని పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో వందలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగాయి. దామెరకుంట పూర్తిగా జలదిగ్బంధం లో చిక్కుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని తిప్పాపురం పంచాయతీలోని పెంకవాగు పొంగడంతో రెండు రోజులుగా తిప్పాపురం, కలిపాక, సీతారాంపురం, పెంకవాగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వెంకటాపురం మండలం బర్లగుడెం పంచాయతీ పరిధిలోని మహితపురం గిరిజన గ్రామం రెండు రోజులుగా జల దిగ్బంధంలో ఉంది.  పస్రా‒ మేడారం మధ్య జంపన్న వాగు పొంగడంతో రాకపోకలు నిలిపివేశారు. మల్హర్‌‌ మండలంలోని రోడ్డ్యాం బ్రిడ్జ్ అవతలి వైపు వరద నీటిలో గొర్రెల కాపర్లు చిక్కుకోగా మత్స్యకారుల సహాయంతో పోలీసులు రక్షించారు. మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్​, గార్ల మధ్య మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డు మూసేశారు.

 

ఆదిలాబాద్​ జిల్లాలో దాదాపు 2 వేల ఎకరాల్లో పత్తి, సోయ పంటలు నీట మునిగాయి. ఇంద్రవెల్లిలో అత్యధికంగా 14.8 సెంటిమీటర్లు, బోథ్ లో 14.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాదిగూడ, కునికాస, గోండుగూడ, కొలాంగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్ మండలం మర్లపల్లి, పట్నాపూర్ వద్ద తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. ఇంద్రవెల్లి మండలంలో వడగాం, గౌపూర్ వాగులు పొంగడంతో మామిడిగూడ, బెస్రాంతాండ, చిత్తబట్ట గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లక్ష్మీపూర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కలెక్టర్ భారతి హోళికేరి గ్రామాన్ని సందర్శించారు. చెన్నూర్, సిరొంచ మధ్య జాతీయ రహదారిని రెండు చోట్ల కట్ చేయించి వరద నీటిని బయటకు పంపించారు. దీంతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూర్  కొత్త బస్టాండ్ ఏరియాలోని పలు ఇండ్లు, సెల్లార్లలోకి నీళ్లొచ్చాయి. ట్రాక్టర్లకు ఇంజిన్లు పెట్టి నీటిని తోడేశారు. చెన్నూర్ మండలం సుద్దాల వాగు తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. చెన్నూరు పెద్ద చెరువు నిండి వరదనీరు బట్టిగూడెం ఇండ్లలోకి వచ్చింది. మంచిర్యాలలోని తిరుమలగిరి, బృందావన్ కాలనీ, సాయికుంట, రాంనగర్ ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. 

 కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా చొప్పదండి లో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిటీలోని అలకాపురి కాలనీ జలమయమైంది. కొత్తపల్లి శివారులోని రోడ్డ్యాం మీదుగా వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో జగిత్యాల వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, జమ్మికుంట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజీ కరకట్ట నాని కూలిపోతున్నది. బ్యారేజీని ఆనుకొని కట్ట కూలిపోవడంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ఆర్జీ 1,2,3 ఓపెన్​కాస్ట్​ప్రాజెక్టుల్లో నీరు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జగిత్యాల– ధర్మపురి రహదారిలో అనంతారం రోడ్యాం వద్ద బ్రిడ్జి పై వరద నీరు ప్రవహించడం తో రాకపోకలు నిలిచిపోయాయి. 

నిజామాబాద్​జిల్లాలో తల్వేద వద్ద వంతెన కుంగిపోవడంతో నవీపేట, నాళేశ్వర్, నందిపేటల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కమ్మర్ పల్లి నుంచి ఓడ్యాట్ వెళ్లే రోడ్డు ప్రవాహనికి కొట్టుకుపోయింది. భీంగల్ మండలం గోనుగొప్పుల లో రోడ్డు కొట్టుకుపోవడంతో ధర్ పల్లి, భీం గల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బోధన్​ మండలం సాలూర వద్ద తెలంగాణ –-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీరా నది పాత బ్రిడ్జిపై నీళ్లు పారుతుండడంతో అధికారులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నవీపేట మండలం లింగాపూర్ లో తుంగిని మాటు కాలువకు గండిపడి 150 ఎకరాల్లో పొలాలు నీటమునిగాయి.  మోర్తాడ్ మండలం ధర్మోర వద్ద పెద్దవాగు ఉధృతి వల్ల పాలెం, ధర్మోర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండడంతో మూడు ఫ్లడ్ గేట్లు ఎత్తారు.  

యాదాద్రి జిల్లాలో మూసీ ఉధృతి కారణంగా భువనగిరి మండలం బొల్లేపల్లి, వలిగొండ మండలం సంగెం మధ్య రాకపోకలు నిలిచాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగంబంధం అలుగు పోయడంతో కోడూరు–తుంగతుర్తి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూరు(ఎస్)లోని గురుకుల స్కూల్​లో తరగతి గదులు, హాస్టల్ లోకి వరద చేరింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మకూర్(ఎస్) క్రాస్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. 

ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో 9.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పాలేరు, ఆకేరు, మున్నేరు, బుగ్గవాగు సహా చాలా వాగుల్లో వరద ప్రవాహం పెరిగి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో ఓపెన్​కాస్ట్​ గనుల్లో నీరు చేరి, లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు పనులు చేస్తున్న ప్రాంతాన్ని వరదనీరు చుట్టిముట్టింది. దీంతో పనులు నిలిపివేసిన ఆఫీసర్లు ముఖ్యమైన యంత్రాలను పైకి తీసుకువచ్చారు.ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.