
హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది. మార్చి 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీగా వానలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తున్నాయి. ఇక మార్చి 18న సాయంత్రం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడుతుంది. నగరంలో గత నాలుగు రోజులుగా ఆకాల వర్షాలు కురవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన పడుతోంది.
నగరంలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది. పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. బహదూర్‌పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్‌లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూక్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
హైదరాబాద్ సిటీ శివార్లలో వడగండ్లు పడటం కామన్.. అయితే మార్చి 18వ తేదీ శనివారం సాయంత్రం సిటీ నడిబొడ్డున వడగండ్ల బీభత్సం భయాందోళనలకు గురి చేసింది. వడగండ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా బైక్స్ పై వెళ్లే వాళ్లకు దెబ్బలు తగిలాయి. కొన్ని ప్రాంతాల్లో కార్లపై వడగండ్లు పడి.. అద్దాలు పగిలాయి.