తేలికపాటి నుంచి మోస్తరు వానలొస్తయ్

తేలికపాటి నుంచి మోస్తరు వానలొస్తయ్

రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. గంటకు 30 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్,  కొమరం భీం, నిర్మల్ ,సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ ,సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ,హైదరాబాద్ ,మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. 

మరో రెండ్రోజుల పాటు..

రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 28, 29 తేదీల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతమైందని, ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలుంటాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. 28న సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. 29న ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు ఉంటాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్​లో..  

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్​లో రాష్ట్రంలోనే అత్యధికంగా10.5 సెం.మీ. వర్షం కురిసింది. చేవెళ్లలో10, ఖమ్మం జిల్లా చింతకానిలో 8, సూర్యాపేట జిల్లా చివ్వెంలలో 7.4, అదే జిల్లా ఆత్మకూర్(ఎస్)లో 7.2 సెం.మీ. వర్షపాతాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్ చెరులో 3.4 సెం.మీ. వాన కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం నాటి రాష్ట్ర సగటు వర్షపాతం 5.9 మిల్లీమీటర్లు ఉండగా, 44 శాతం ఎక్కువగా 8.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.