మళ్లీ వర్షం దంచికొట్టింది

మళ్లీ వర్షం దంచికొట్టింది
  • పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
  • సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
  • నీట మునిగిన నిర్మల్​ ఓంకారేశ్వరాలయం
  • కొట్టుకుపోయిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు

నిర్మల్/ఆదిలాబాద్​ టౌన్/ ఇచ్చోడ/నర్సాపూర్​(జి), వెలుగు: మళ్లీ వర్షం దంచికొట్టింది. రెండు రోజులుగా కురుస్తున్న వానతో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు తడిసిముద్దయ్యాయి.  వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. జైనథ్ మండలం సాత్నాల, తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో గేట్లు ఎత్తినీటిని దిగువకు వదులుతున్నారు. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. బోథ్ మండలంలోని పొచ్చర, నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాలు కళకళలాడుతున్నాయి. మామడ మండలం సాంగ్వి, నిర్మల్, -ఖానాపూర్, సారంగాపూర్ మండలాల్లో పలుచోట్ల కల్వర్టులు, రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇచ్చోడలోని చారిత్రక మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ భారీగా నీరు చేరడంతో భక్తులు మరపడవపై దర్శనానికి వెళ్తున్నారు. నిర్మల్ ​గొలుసుకట్టు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాద్రిపేట ఖజానా చెరువుకు ఆనుకొని ఉన్న ఓంకారేశ్వర ఆలయం నీట మునిగింది. గర్భగుడిలోకి వరద నీరు చేరింది. కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పెరిగింది. శనివారం ఉదయం వరకు జిల్లాలో 24.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఖానాపూర్​లో అత్యధికంగా 99 మి.మీ వర్షపాతం రికార్డు అయిందని ఆఫీసర్లు తెలిపారు.